Allegations on YSRCP MLA Ravindranath Reddy సీఎం మామ..మజాకా! 45 అడుగుల రోడ్డు 25 అడుగులైయ్యింది..!
🎬 Watch Now: Feature Video
Allegations on YCP MLA Ravindranath Reddy: వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గవంకలో నిబంధనలు అంరికీ వర్తిస్తాయి. నిబంధనలు పాటించే విషయంలో అక్కడి అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తారంటూ ప్రజలు పేర్కొంటుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే విషయంలో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తారని కూడా ఆ ప్రజలే ఆరోపిస్తారు. ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు.. సీఎం మేనమామ కూడా. అందుకే ఆయన దారికి అడ్డుగా ఏ అధికారి వెళ్ళడు. ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు సంబందించిన థియేటర్ కోసం రోడ్డును కుదించారంటే.. పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సామాన్యులకు వర్తించని ఇలాంటి వెసులు బాటు ముఖ్యమంత్రి మామకు మాత్రమే వర్తించడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. రోడ్డు వెడల్పులో పేదల ఇళ్లను కూల్చిన అధికారులు... ఎమ్మెల్యేకు సంబంధించిన థియేటర్‌ను పట్టించుకోకపోవడంపై సీపీఐ నేతలు మండిపడుతున్నారు.
గ్రూప్ థియేటర్స్ కోసం: బుగ్గవంక సుందరీకరణలో భాగంగా రక్షణ గోడ నిర్మించి.. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అందులో భాగంగా బుగ్గవంక అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో కోసం కరోనా సమయంలో రెవెన్యూ, నగరపాలక అధికారులు పేదలు అక్రమంగా ఇళ్లను నిర్మించుకున్నారంటూ వాటిని కూల్చివేశారు. అయితే, సీఎం జగన్ (CM Jagan) మేనమామ, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డికి (MLA Ravindranath Reddy) చెందిన గ్రూప్ థియేటర్స్‌ను అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని.. సీపీఐ నేత వెంకట శివ మండిపడ్డారు. రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా తన గ్రూప్ థియేటర్స్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కానీ అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45 అడుగుల అప్రోచ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదన పెట్టారని తెలిపారు. అయితే, సామాన్య ప్రజలు ఉండే చోట రోడ్డు నిర్మాణం కోసం 45 అడుగుల మేర స్థలాన్ని సేకరించారని.. ఎమ్మెల్యేకు సంబంధించిన థియేటర్ ఉన్న చోట కేవలం 25 అడుగుల రోడ్డు నిర్మించారని ఆరోపించారు. ఈ మేరకు సీపీఐ నాయకులు స్వయంగా రోడ్డు నిర్మించే ప్రదేశాన్ని కొలతలు తీసి పరిశీలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మారు ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.