Vitamin D Tablets Side Effects In Telugu : మనం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు విటమిన్-డి చాలా అవసరం. ఎముకల పెరుగుదలకు, రోగ నిరోధక శక్తి, కండర వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు విటమిన్-డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే విటమిన్-డి లోపం ఉన్నవారు షాపుల్లో లభించే మాత్రలను అధికంగా వాడితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. విటమిన్-డి మాత్రలను ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎక్కువగా విటమిన్-డి మాత్రలు వాడితే ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.
అతిగా తీసుకుంటే అనర్థమే
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి విటమిన్-డి మాత్రలను తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వారు సూచించిన మోతాదులో మాత్రమే విటమిన్-డి మాత్రలు తీసుకోవాలి. కొంతమంది అధికంగా విటమిన్-డి మాత్రలను వాడుతుంటారు. అలా వాడటం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-డి మాత్రలు అధిక వినియోగం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
హైపర్ విటమినోసిస్
విటమిన్-డి మాత్రలను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అరుదైన సమస్య హైపర్ విటమినోసిస్. శరీరంలో విటమిన్-డి స్థాయిలు తక్కువగా ఉన్నవారికి వైద్యులు ఆ మాత్రలను వాడాలని సూచిస్తుంటారు. విటమిన్-డి లోపాన్ని అధిగమించేందుకు కొంతమంది అవగాహన రాహిత్యంతో అధికంగా ఈ మాత్రలను వాడుతుంటారు. ఫలితంగా వారికి వచ్చే ఆరోగ్య సమస్యనే హైపర్ విటమినోసిస్ అంటారు. శరీరంలో విటమిన్-డి స్థాయిలు ఎక్కువైన వారిలో కనిపించే లక్షణాలు ఇవే..
విటమిన్-డి మాత్రలు అధికంగా తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు
- ఆకలి మందగించటం
- మలబద్ధకం
- డీహైడ్రేషన్
- అలసటగా ఉండటం
- అతి మూత్ర విసర్జన
- అధిక రక్తపోటు
- కండరాల బలహీనత
- వికారంగా ఉండుటం
- దాహం
- వాంతులు
Vitamin D Supplement Side Effects : మీరు విటమిన్-డి మాత్రలు వాడుతున్నపుడు పైన వివరించిన లక్షణాలును ఎదుర్కొన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. ఏయే సప్లిమెంట్లు మీరు తీసుకుంటున్నారో, పూర్వ ఆరోగ్య సమస్యలు గురించి డాక్టర్‌కు వివరంగా తెలియజేయాలి. ఏ మోతాదులో తీసుకునేవారో కూడా వివరించడం అవసరం. అధికంగా విటమిన్-డి మాత్రలు వాడటం వల్ల మరికొన్ని తీవ్రమైన ఆరోగ్యపరమైన సంకేతాలు ఉన్నాయి. అవే హైపర్ కాల్సెమియా, కిడ్నీ, ఎముకల సమస్యలు.
- హైపర్ కాల్సెమియా : విటమిన్-డి ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం అధికంగా చేరుతుంది. ఈ పరిస్థితినే హైపర్ కాల్సెమియా అంటారు.
- కిడ్నీ సమస్యలు : డాక్టర్ సూచించిన దానికంటే అధికంగా విటమిన్-డి మాత్రలను తీసుకున్నపుడు మూత్రపిండాల సమస్యకు దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
- ఎముకల సమస్యలు : ఎముకల ఆరోగ్యానికి విటమిన్-డి మాత్రలు చాలా అవసరం. అయినప్పటికీ విటమిన్-డి మాత్రలు అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు ఎముక పెలుసుబారిపోవచ్చని పరిశోధనలో తేలింది.
ఎవరికి ఏయే మోతాదులో విటమిన్-డి అవసరం
క్లీవ్‌ల్యాండ్ క్లీనిక్ వారి అధ్యయనం ప్రకారం
- 19-50 సం. వయసు వారికి : 600 IU/D
- 50-70 సం. వయసు వారికి : కనీసం 600 IU/D
- 70 సంవత్సరాలకంటే అధిక వయసు వారికి : కనీసం 800 IU/D
- ఆరోగ్యవంతమైన యుక్తవయసు వారికి : 4000 IU/D
డాక్టర్ సలహా ప్రకారం విటమిన్-డి మాత్రలను వాడటం ఉత్తమం. అయితే ఈ మాత్రలు ఉపయోగించే సమయంలో తరచుగా మీ శరీరంలో విటమిన్-డి స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి.