Vegan Diet Facts in Telugu : ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వారు పాటించే ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొవిడ్ తర్వాత ఎక్కువ మంది వ్యక్తిగత ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాంసాహారానికి దూరంగా ఉంటూ శాకాహారంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అందులోనూ ఎక్కువ మంది ఫాలో అవుతోన్న ఆహార పద్ధతి వీగన్ డైట్(Vegan Diet). అయితే ఇంతకీ వీగన్ డైట్ అంటే ఏమిటి? చాలా మందిలో ఈ డైట్‌కు సంబంధించి వచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలపై నిపుణులేమంటున్నారో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
What is The Vegan Diet in Telugu : వీగన్స్గా మారేవారు మూగజీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటూ ఆరోగ్యకరమైన ఆహార పద్ధతిని అవలంబిస్తారు. మాంసం, గుడ్లతో పాటు పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు దూరంగా ఉంటూ కేవలం మొక్కల నుంచి లభించే సహజ సిద్ధ ఆహార పదార్థాలను మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. ఇదే వీగన్ డైట్‌లోని ప్రధానాంశం.
వీగన్ డైట్ ద్వారా శరీరానికి సరిపడా పోషకాలు అందవా?
సాధారణంగా మనం తీసుకునే గేదె, ఆవు పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మాంసాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అయితే వీగన్లు వీటికి దూరంగా ఉండడం వల్ల వారికి సరిపడా పోషకాలు లభించవని కొందరు అనుకుంటారు. అయితే అది పూర్తిగా అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహార పదార్థాల్లో కూడా ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు. బ్రోకలీ, ఓట్స్, బీన్స్, నట్స్, క్వినోవా, బచ్చలికూర, తృణధాన్యాలు.. వంటి వాటిల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయన్నారు. అలాగే సోయా, కొబ్బరి, బాదం.. వంటి పదార్థాల నుంచి తీసిన పాలలో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. మాంసాహారం నుంచి లభించే పోషకాలతో పోల్చుకుంటే వీగన్ పదార్థాల్లో లభించే ప్రొటీన్లు, క్యాల్షియంను శరీరం తొందరగా గ్రహిస్తుందంటున్నారు.
ఈ డైట్ పాటించడం కష్టమా?
కొందరు సాధారణ డైట్ నుంచి వీగన్ లైఫ్‌స్టైల్‌కి మారడం కష్టమనుకుంటారు. అయితే మన దృష్టి ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నామనే దానికంటే ఏయే పదార్థాలను తినొచ్చన్న దానిపై కేంద్రీకరిస్తే.. ఇలాంటి ప్రశ్నలు/సందేహాల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. వాస్తవానికి వీగన్ వంటకాలను పరిశీలిస్తే వీటిలో ఎన్నో రకాల వెరైటీలు మనకు కనిపిస్తాయి. అదే విధంగా ప్రస్తుత మార్కెట్లో నాన్‌వెజ్‌కి బదులుగా మొక్కల ఆధారిత మాంసాహార ఉత్పత్తులు (ప్లాంట్ బేస్‌డ్ మీట్) కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వీగన్ డైట్‌కి అలవాటు పడడం కష్టమైన పనేమి కాదు.
మొక్కలతో ముక్క.. వీగన్స్ కోసం స్పెషల్
గర్భిణులు వీగన్ డైట్ పాటించవచ్చా?
మహిళలు గర్భం దాల్చాక ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే చాలా మంది పోషకాల కోసం మాంసం, పాలు, గుడ్లు.. మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వీగన్లు వీటిని తీసుకోరు కాబట్టి గర్భిణులకు ఈ డైట్ సరికాదనే భావన కొంతమందిలో ఉంటుంది. కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు నిపుణులు..
మొక్కల ఆధారిత ఆహారపదార్థాల్లోనూ గర్భిణులకు కావాల్సిన ప్రొటీన్లు, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయని.. అంతేకాకుండా గర్భధారణ సమయంలో వచ్చే పలు సమస్యల్ని కూడా ఇవి తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణులు ఈ డైట్ పాటించే ముందు ఓసారి వైద్యులు/పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు.!
ఈ డైట్‌తో ఏవైనా అనారోగ్య సమస్యలొస్తాయా?
కొందరు మాంసం, పాలు, గుడ్లు.. వంటివి తీసుకుంటేనే శరీరానికి పోషకాలన్నీ అందుతాయనే భావనలో ఉంటారు. లేదంటే పోషకాహార లోపంతో పలు అనారోగ్యాలు తప్పవనుకుంటారు. కానీ, ఇది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల ముప్పు పొంచి ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. అదే వీగన్ డైట్ పాటించే వారికి ఈ రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
నోట్ : అయితే కొత్తగా ఈ డైట్‌ని పాటించాలనుకునే వారు ముందుగా ఓసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. అలాగే తమ శరీరతత్వాన్ని బట్టి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం మరీ ఉత్తమం.
Weight Loss Tips : ఈజీగా బరువు తగ్గాలా.. ఈ చిట్కాలు పాటించండి..!