ఆహారంలో చెడు కొలెస్ట్రాల్‌కు కారణమయ్యే వాటిని దూరంగా ఉంచితే మెనోపాజ్‌లో దరిచేరే హృద్రోగాల సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఓట్స్, చిరుధాన్యాలు, బార్లీని ఆహారంలో చేర్చుకొంటే ఈ సమస్య దరి చేరదు. వీటిలోని బెటా గ్లూకాన్ శరీరంలో పేరుకొన్న చెడు కొలెస్ట్రాల్‌ను పోగొడుతుంది. ఉదయం అల్పాహారంగా ఓట్స్‌తో చేసే పదార్థాలను పండ్ల ముక్కలతో కలిపి తీసుకొంటే మంచిది. అలాగే ప్రొటీన్లు, పీచు పుష్కలంగా ఉండే బీన్స్, బఠాణీలు, రాజ్మాతో చేసే వంటకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హృద్రోగానికి కారణమయ్యే కొలెస్ట్రాల్‌గా మారే చెడు కొవ్వును తగ్గిస్తాయి. పీచు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండే గింజ ధాన్యాలు, బాదం, వేరుశనగ, అక్రోట్లు రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. వీటితో శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అందుతుంది.
వెల్లుల్లితో..
అల్లిసిన్ అనే రసాయనం ఇందులో ఉండటంతో కొలెస్ట్రాల్‌ను పెరగకుండా నియంత్రిస్తుంది. శరీరంలో అనవసరంగా పేరుకుపోయే కొవ్వును ఇది కరిగించగలదు. హృద్రోగాలకూ దూరంగా ఉండొచ్చు. పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగితే చాలు. ప్రయోజనాలెన్నో అందుతాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొవ్వును పెరగకుండా సమన్వయం చేస్తాయి. వంటల్లో వెజిటబుల్ ఆయిల్స్ వినియోగం మంచిది. యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీలతోపాటు నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో పెక్టిన్ మెండుగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సోయా పాలను అల్పాహారంతో కలిపి తీసుకొంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదు, వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు చేపను ఆహారంలో చేర్చుకోవాలి. మాంసానికి బదులుగా తీసుకొనే చేపలో ఒమేగా - 3 ఫ్యాటీయాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి నిండైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.