Reasons For Weight Gain ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అకస్మాత్తుగా నాలుగైదు నెలల్లోనే 10 కేజీలు అలా పెరుగుతుంటారు. కారణాలేంటో అర్థం కాక అయోమయానికి గురవుతుంటారు. ఈ అధిక బరువుకు మానసికపరమైన అయిదు అంశాలు కారణం కావొచ్చు అంటున్నారు నిపుణులు.
1. ఒత్తిడితో..
ఒత్తిడికి గురైనప్పుడు తరచూ చిరుతిళ్లపై ఆసక్తి చూపిస్తారు. రోజులో ఆరేడుసార్లు ఆహారం తీసుకుంటారు. మనసును దారి మళ్లించడం కోసం ఇలా ప్రయత్నిస్తారు. దీంతో కొద్దికాలంలోనే, తెలియకుండా బరువు పెరుగుతారు. ఈ పరిస్థితిలో ఒంటరిగా ఉండకూడదు. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి పరిష్కారమార్గాన్ని అన్వేషించాలి. డ్యాన్స్, సంగీతం వినడం, సినిమాలు చూడటం లేదా స్నేహితులతో మాట్లాడటం ప్రశాంతతనిచ్చి, ఒత్తిడిని దూరం చేస్తాయి.
2. బద్ధకం..
రోజూ వ్యాయామం చేయాలనుకున్నా, సమయం వీలుకాక లేదా బద్ధకించి అటువైపు అడుగులేయరు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే ఉద్యోగినులకు ప్రతి రోజూ ఉదయం కనీసం అరగంట వ్యాయామం మంచిది. ఇంటి పనులే కాకుండా నడవడానికి టైం కేటాయించుకోవాలి. వర్కవుట్లు తప్పనిసరి అని నిబంధన పెట్టుకోవాలి. కనీసం అరగంటసేపైనా నడకకు ప్రాధాన్యతనివ్వాలి.
3. ఆందోళనగా..
అనుకోనిది జరిగినప్పుడు మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. ఇది మానసికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదో ఆలోచిస్తూ, తినేటప్పుడు ఎంత తింటున్నారో గుర్తించక అధికంగా తీసుకుంటారు. క్రమంగా ఇది బరువును పెంచుతుంది. సమస్యను పరిష్కరించుకోవడానికి మనలోని నైపుణ్యాలను బయటకు తీయాలి. యోగా, ధ్యానం వంటివి నాడీ వ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపి, ఆందోళనను తగ్గిస్తాయి.
4. అవసరానికి మించి..
ఆకలి తగ్గింది అనిపించినప్పుడు ఆహారాన్ని తీసుకోవడం ఆపెయ్యాలి. అవసరానికి మించి పళ్లెంలో ఉన్నవన్నీ అయ్యేవరకు ఏకబిగిన తింటే కెలోరీలు పెరుగుతాయి. ఉదయం అల్పాహారానికి దూరంగా ఉండి, మధ్యాహ్నం ఒకేసారి రెట్టింపు భోజనాన్ని తీసుకున్నా శరీరానికి నష్టమే. రాత్రి ఆలస్యంగా ఎక్కువ కెలోరీలున్న ఆహారాన్ని తీసుకొని వెంటనే నిద్రలోకి జారుకున్నా ప్రమాదమే. రోజులో అయిదుసార్లు కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవాలి.
5 వారంలో..
డైటింగ్ పేరుతో వారంలో నాలుగు రోజులు పూర్తిగా తినడం తగ్గించి, మిగతా మూడు రోజులు నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రయోజనం ఉండదు. బరువు పెరగకూడదనే లక్ష్యాన్ని మరవకూడదు. ఆకలి అనిపించినప్పుడు కొవ్వుపదార్థాలను కాకుండా తాజా పండ్లు తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇవి శరీరంలో మలినాలను పోగొడతాయి.
ఇదీ చదవండి: కంట్లో నల్లగుడ్డుపై తెల్లపొర ఉంటే క్యాన్సరేనా