Link Between Fasting and Ageing : దైవ భక్తిలో మునిగిపోయేవారు తరచూ ఉపవాసం చేస్తారు. అయితే.. మిగిలిన వారు కూడా తప్పకుండా ఉపవాసం చేయాలని.. చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు! మరి.. అందులో నిజమెంత? దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? వృద్ధాప్యానికీ ఉపవాసానికీ సంబంధం ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
ఎన్నో ప్రయోజనాలు..
తరచూ చేసే స్వల్పకాలిక ఉపవాసం.. మానవ శరీరంపై ఎంతో ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా దేహంలోని కణాలను రిపేర్ చేయడంలో.. కంటికి మెరుగైన నిద్ర అందించడంలో.. అన్నిటికన్నా ప్రధానంగా ఊబకాయం బారిన పడకుండా.. స్థిరమైన, సమర్థవంతమైన బరువును మెయింటెయిన్ చేయడంలో ఉపవాసం ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట!
డయాబెటిస్ దూరం..
2023లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వారంలో మూడు రోజులు అడపాదడపా ఉపవాసం చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిదట. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సైతం మెరుగు పడుతుందట. తద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గిపోతుందట! ఆరోగ్య పరిరక్షణలో ఇది చాలా ముఖ్యమైన అంశమని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో.. స్వల్పకాలిక ఉపవాసం సహాయపడుతుందని, మధుమేహంలో సాధారణంగా వచ్చే స్పైక్‌లను నివారిస్తుందని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు..
గుండె ఆరోగ్యం కూడా ఉపవాసంతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలిందట. ఇంకా.. ఊబకాయంతోపాటు, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చాలా వరకు తగ్గించడంలో ఉపవాసం ఎంతగానో సహకరిస్తుందని అంటున్నారు.
ఉపవాసానికీ వృద్ధాప్యానికీ లింక్ ఉందా?
పైన చెప్పుకున్న ప్రయోజనాలతోపాటు వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలోనూ ఉపవాసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక ఉపవాసం.. ఎముక మజ్జ (bone marrow), పరిధీయ ప్రసరణ మధ్య ఇమ్యూన్ సెల్స్ లేదా ల్యూకోసైట్‌లను రీ-డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పనితీరును ప్రభావితం చేస్తుందని పుణేకు చెందిన డైటీషియన్ జ్ఞానేశ్వరి బార్వే చెబుతున్నారు. తద్వారా.. వయసు మీదపడే ప్రక్రియ ఆలస్యమవుతుందని అంటున్నారు.
బ్రేక్ ఫాస్ట్‌కు సరైన ముహూర్తం ఇదే - దాటితే గుండెపోటు గండం!
అయితే.. కాసేపు ఉపవాసం ఉన్న తర్వాత, ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉపవాసం ముగించిన తర్వాత వెంటనే ఎక్కువ తినడం వల్ల దాని ప్రయోజనాలు సరిగా అందకపోవచ్చని చెబుతున్నారు. తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే.. మేలు జరుగుతుందని చెబుతున్నారు.
జన్యు నిపుణుడు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ సింక్లైర్ కూడా ఈ విషయమై మాట్లాడారు. మనలో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మది కావాలంటే.. అతిగా తినకూడదని అంటున్నారు. రోజులో ఓ పూట కూడా భారీ స్థాయిలో తినకూడదనే విషయాన్ని తాను నేర్చుకున్నానని.. దాన్నే పాటిస్తున్నానని 2023లో ఓ మీట్లో డేవిడ్ చెప్పారు. ఉపవాసం ఉండడం ద్వారా మీ శరీరంలో తగినంత శక్తి లేనప్పుడు.. సిర్టుయిన్స్ అని పిలిచే జన్యువుల సమితి మేల్కొంటుందని.. అది వృద్ధాప్య ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తుందని సింక్లైర్ చెప్పారు.