సాధారణంగా కొంతమంది వివిధ ఆహార పదార్థాల్లో పోషక విలువల కోసం గూగుల్లో వెతుకుతారు. అందులో అరటి పళ్లు, యోగర్ట్, బ్లూబెర్రీస్ వంటి వాటి గురించి తెలుస్తుంది కానీ తీపి బంగాళ దుంపగా పేరొందిన చిలగడ దుంప లో ఉన్న పోషకాల గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. దీని గురించి నేరుగా డైటీషియన్, న్యూట్రిషయన్లను అడిగి తెలుసుకుని రోజూ వారీ మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.
వీటిని తినటం వల్ల కలిగే ప్రయోజనాలివే!
1. జీర్ణ సమస్య తగ్గుతుంది:
ఒక స్వీట్ పొటాటోలో రోజు వారి విలువలో ఫైబర్ 15 శాతం ఉంటుందని ప్రముఖ డైటీషియన్ నటాలియో రిజో చెప్పారు. ఇది మన పేగు ఆరోగ్యానికి అవసరమని పేర్కొన్నారు. దీన్ని తినటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమయ్యి.. మల బద్ధకం సమస్యను నివారిస్తుంది.
2. రక్తంలో చక్కెర స్థిరత్వం:
చిలగడ దుంప సంక్లిష్ట పిండి పదార్థం కావటం వల్ల.. సాధరణ పిండి పదార్థాలతో పోలిస్తే జీర్ణం అవటానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని డైటీషియన్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెస్సికా లెహ్మన్ తెలిపారు. ఇది తినటం వల్ల మన రక్తంలోని చెక్కర స్థాయులు పెరగవు. అంతే కాకుండా మానసిక, శక్తి స్థాయులను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. వాపు తగ్గిస్తుంది:
యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల్లో ఈ చిలగడ దుంపను కలపొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ -సి, కెరోటినాయాడ్లు.. మన శరీరంలోని వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ కణాలను రక్షిస్తాయి.
4. బూస్టర్లా పనిచేస్తుంది:
చిలగడ దుంప వల్ల దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పెరగి ఎముకలూ దృఢంగా అవుతాయి. తరచూ దీన్ని తినటం వల్ల చర్మానికి మంచిది. ముడతలు పడకుండా కాపాడుతుంది.
5. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది:
చిలగడ దుంపలు మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్-బి6 అధికంగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే న్యూరో ట్రాన్స్ మిటర్ అయిన సెరెటోనిన్ను సంశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది.
అయితే వీటిని ఎక్కువగా తినటం వల్ల పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ.. పిండి పదార్థాలు ఉండటం వల్ల మధుమేహంతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీటిల్లో ఆక్సలేట్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లున్న వాళ్లు తక్కువగా తినడం ఉత్తమం. ఇక వీటిని ఎంత మొత్తంలో తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. రోజుకో చిలగడదుంప తింటే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.