మన శరీర భాగాన్ని మోసే అతి ముఖ్యమైన భాగం నడుము. అందుకే దీనిపై భారం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా నడుము బలహీన పడినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. దీనికి కారణం.. ఆ భాగంలో ఉండే ఎముకలపై అధికంగా భారం పడటం లేదా వాటికి కావాల్సిన కాల్షియం వంటి పోషక విలువలు సరిపడా అందకపోవడం. 25 ఏళ్ల లోపల వయసుండే స్త్రీ, పురుషులకు ఈ సమస్య పెద్దగా ఉండదు.
వీరికి ఈ సమస్య ఎక్కువ!
ఈ నడము నొప్పి సమస్య అందరికీ ఉండదు. కానీ.. ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్లకు, విటమిన్-డీ లోపంతో బాధపడేవాళ్లు, వాతాన్ని పెంచే ఆహారం (కారం, ఎక్కువ చేదు, చల్లని పానీయాలు) అధికంగా తీసుకునే వాళ్లు, ఎక్కువ సేపు వంగి పని చేసేవాళ్లు.. ఈ సమస్యతో బాధపడే అవకాశముంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన శైలిలో మార్పులు, ఆహార నియమాలు తదితర అంశాల వల్ల దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని చికిత్సకు ఇంగ్లీష్ మందులున్నప్పటికీ.. కొందరు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వారి కోసం ఒక మంచి ఔషధం ఉంది. ఇంకో మంచి విషయం ఏంటంటే.. దాన్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: శుద్ధ గుగ్గులు, వావిలాకులు, అశ్వగంధ, దుంపరాష్ట్రం
- తయారీ విధానం:
- ముందుగా శుద్ధి చేసిన గుగ్గుల చూర్ణం 50 గ్రాములు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
- ఎండబెట్టుకున్న వావిలాకుల చూర్ణాన్ని 50 గ్రాములు అందులోనే వేసుకోవాలి.
- అశ్వగంధ చూర్ణాన్ని సైతం అంతే మోతాదులో కలపాలి.
- చివరిగా దుంపరాష్ట్రం చూర్ణాన్ని సైతం 50 గ్రాముల పరిమాణాన్ని అందులో వేసి చూర్ణాలన్నింటినీ బాగా కలపాలి.
- తర్వాత ఒక బాండీని స్టౌపై పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి వాటిని మరిగించుకోవాలి.
- మనం ముందుగా తయారు చేసుకున్న చూర్ణాల మిశ్రమాన్ని ఒక స్పూను అందులో వేయాలి.
- సన్నటి మంటపై పెట్టి సగం నీరు ఆవిరయ్యేంత వరకు కాచుకోవాలి.
- తర్వాత దాన్ని దించి ఒక వడపాత్రతో గ్లాసులో వడ పోసుకుని తాగాలి.
ఈ కషాయాన్ని నడుము నొప్పితో బాధపడుతున్న వారు.. రోజూ ఉదయం, సాయంత్రం 30-40 మిల్లీ లీటర్లు పరిమాణంలో తీసుకోవచ్చు. వేడి వేడిగా తాగితే సత్ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకుంటే తర్వాతి రోజుల్లో ఉపయోగించుకోవచ్చు.
మరో ఆయుర్వేద ఔషధం..
ఆయుర్వేద పద్ధతిలో నడుం నొప్పి తగ్గడం కోసం మరో ఔషధం తయారీ కోసం తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.