YSR Congress Party Twitter Post Controversy: మహా శివరాత్రి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టిర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమవుతోంది. శివుని ఆరాధనను కించపరిచేలా అధికార పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ సమాజానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
'మహా శివరాత్రి రోజున సందేశాలు ఇవ్వడానికి జగన్ మోహన్ రెడ్డి జగ్గీ గురువు అనుకుంటున్నాడా?' అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఆగ్రహించారు. వైసీపీ పెట్టిన పోస్టుపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయకూడదన్నారు. ఆ పోస్టును చూస్తుంటే.. హిందూ వ్యతిరేకులు చూసి సంతోషించే విధంగా ఉందని, హిందువులను అవమానపరిచేలా ఆ పోస్టును పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ఎంతోమంది పిల్లలు ఆహారం లేక గగ్గోలు పెడుతున్నా, వాళ్లని పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. రాష్ట్రమంతా జగనే పౌష్టికాహారం అందిస్తున్నట్టుగా ఆ ట్వీట్‌లో బిల్డప్ ఇచ్చారని, భగవంతుడి వేషధారణలో ఉన్న పిల్లవాడికి ఇలా చేయడం తీవ్ర అభ్యంతరకరమని జీవీఎల్ గుర్తు చేస్తూ.. ఆ ట్వీట్‌కు వైసీపీ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు స్పందిస్తూ.. 'ఇంకొక మత ఆచారాలను కించపరిచేలా ప్రవర్తించడం ఎవరికైనా సరైన విధానం కాదు... అందులోనూ రాజకీయ పార్టీకి అసలే కాదు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఒక మతపరమైన అజెండా నడుపుతోందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు' అంటూ ఆయన ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఐ.వై.ఆర్. కృష్ణారావు ట్వీట్‌తో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సముఖంగా స్పందించారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే బీజేపీ రోజురోజుకు వివాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడాన్ని బీజేపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పండి అంటూ మంత్రి ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు లేవని, ప్రస్తుతం బీజేపీ నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
ఇంతకి ఆ ట్వీట్‌లో ఏముందంటే.. అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన అనే శీర్షికతో.. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. దాంతోపాటు సీఎం జగన్ ఓ బాలికకు పాలు పట్టిస్తున్న ఫొటో, ఆ పక్కనే నందీశ్వరుడి ఫొటోలు ఉన్నాయి.
ఇవీ చదవండి