ఆంధ్రప్రదేశ్లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, వైకాపా నాయకులు రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు కుల ముద్ర వేసిన నేతలు... సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ ముద్ర వేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి కూడా పరిమితులుంటాయని జగన్ తెలుసుకోవాలని తులసిరెడ్డి సూచించారు. అలాగే మహమ్మారి కరోనా వ్యాప్తి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
ఇటీవల పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయిని రాజ్యసభ సభ్యుడిగా భాజపా నామినేట్ చేయడాన్ని తులసిరెడ్డి తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బ తీస్తాయని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సీటును జస్టిస్ రంజన్ గొగొయి తిరస్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పదవీ విరమణ చేసిన తర్వాత కనీసం పది సంవత్సరాల పాటు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా ఒక చట్టం తీసుకురావాలని తులసిరెడ్డి సూచించారు.
ఇదీ చదవండి:ఎస్ఈసీకి భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు కన్నా లేఖ