కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు.. తమ మనుగడను దెబ్బతీస్తున్నాయని ఆ ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులు, సభ్యుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజాసంఘాల ప్రతినిధులు.. వారికి బాసటగా నిలిచారు.
తుమ్మలపల్లితోపాటు కర్మాగారం బాధిత గ్రామాల ప్రజలు తరలివచ్చారు. శుద్ధి కర్మాగారం ప్రారంభానికి ముందు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఫిర్యాదు చేశారు. తమ పంటలు దెబ్బతిన్నాయని, ప్రకృతి వనరులు కలుషితంగా మారాయని, చర్మవ్యాధి సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లభించక వలసపోవాల్సిన దుస్థితి వచ్చిందని అంటున్నారు.
భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై న్యాయవిచారణ చేపడుతున్నామంటూ ఇప్పటికే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నందున బాధితులు తమ పరిస్థితిని వివరించేందుకు విజయవాడ తరలివచ్చారు. యూసీఐఎల్ ప్రతినిధులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పరిశ్రమ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూసీఐఎల్ పరిశ్రమ వ్యర్థాలతో జరిగే నష్టాల అధ్యయానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ తమ ప్రాంతాల్లో పర్యటిస్తే.. వారికీ తమ పరిస్థితులను వివరిస్తామని బాధితులు తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తామన్నారు.