కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో ఠాణా పరిధిలోని ముగ్గురు క్రికెట్ బుకీలను(three arrested for cricket betting) శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.10 లక్షల నగదుతో పాటు 1,700 గ్రాముల గంజాయి, 16 చరవాణులు కలిగిన కమ్యూనికేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండో ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లి వీధిలోని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. దస్తగిరిపేటకు చెందిన కురేసి నిస్సార్ అహమ్మద్ అలియాస్ నిస్సార్ (ప్రస్తుతం మాసాబ్‌ట్యాంకు, హైదరాబాద్), ముస్తాక్ అహమ్మద్ కురేషి (ప్రస్తుతం మొహిదీపట్నం, హైదరాబాద్), కల్లుట్ల కరీముల్లా అలియాస్ లారాను అరెస్టు చేశారు. వీరు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉంటూ ప్రొద్దుటూరులో సహాయకుల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరిలో నిస్సార్‌పై గతంలో మూడు గంజాయి కేసులు ఉన్నాయి.
ఎవరీ సుబ్బారెడ్డి?..
అరెస్టయిన క్రికెట్ బుకీలకు అంతర్రాష్ట్రాలకు చెందిన బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో తెల్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తెలంగాణ ప్రాంతాల్లో బెట్టింగ్ కార్యకలాపాలు జరుపుతున్నట్లు గుర్తించారు. పాత బుకీలతో పాటు కొత్త వ్యక్తులు కూడా బెట్టింగ్ జరుపుతున్నారని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి సుమారు 15 ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా అతడి ఉనికి తెలియలేదన్నారు. ఇతడు పలుచోట్ల స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాడని, ముగ్గురు బుకీలను అరెస్టు చేయడంతో వారి ద్వారా సుబ్బారెడ్డి పేరు బయటకొచ్చిందన్నారు. వీరితో పాటు హిందూపురానికి చెందిన సునీల్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రాజేష్ కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందని, వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కొత్త బుకీలపై నిఘా..
క్రికెట్ బెట్టింగ్‌లో పాత నిందితులతో పోలిస్తే కొత్త బుకీల ప్రమేయం ఎక్కువగా ఉందని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. ప్రధానంగా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్‌ను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
corruption in NREGA Works: ఉపాధి హామీ పనుల్లో అవినీతి... రూ.1.42 కోట్లు పక్కదారి