కడప జిల్లా గాలివీడు మండల జడ్పీటీసీ స్థానానికి షేక్ భానుబీ (87) అనే వృద్ధురాలు మంగళవారం నామపత్రం దాఖలు చేశారు. వైకాపా మద్దతురాలిగా జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. మైనార్టీ నాయకుడు ఖాదర్‌మొహిద్ధీన్ వైకాపా గాలివీడు మండల నాయకుడిగా ఉన్నారు. రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన కుటుంబానికి జడ్పీటీసీ టికెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గాలివీడు జడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ చేయడంతో మహిళలే పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబంలో అర్హత గల ఇతర మహిళలు లేకపోవటంతో తన తల్లి భానుబీని పోటీలో నిలిపినట్లు ఆమె కుమారుడు ఖాదర్‌మొహిద్ధీన్ ప్రకటించారు. పదేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె గాలివీడు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఓటమి చెందారు. 8 పదుల వయసు దాటినా ఆమె ఎన్నికల పోటీ చేసేందుకు నామపత్రం దాఖలుకు మరోసారి ముందుకు రావటంతో కడప జడ్పీ కార్యాలయం వద్ద మిగిలిన అభ్యర్థులంతా ఆమె ఆసక్తిని చూసి ఔరా! అంటూ ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి:శ్రీకాకుళంలో సీఐపై చేయిచేసుకున్న వైకాపా అభ్యర్థిని