TDP Leaders Condemn BTech Ravi Arrest: పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్ట్ పై తెలుగుదేశం నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి స్పందించారు. అరెస్ట్ అక్రమం అని పేర్కొన్నారు. కేవలం కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే కేసులు బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్లు ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు వంతపాడుతున్న పోలీసులు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
నారా లోకేశ్: జగన్ రెడ్డి తాను పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాలన్నా గజగజా వణుకుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. బీటెక్ రవి అరెస్ట్‌పై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీఎం జగన్ పరదాలు, బారికేడ్‌లు, మూసివేత, ముందస్తు అరెస్టులు ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయం అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్ అంటూ ఆరోపించారు. తన ఎన్నికల ప్రత్యర్థి అయిన బీటెక్ రవిని చూసి సీఎం జగన్ భయపడుతున్నాడని లోకేశ్ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపుకి పోలీసులను పార్టీ కార్యకర్తల వాడు కుంటున్నాడని దుయ్యబట్టాడు. బీటెక్ రవి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. బీటెక్ రవికి ఎలాంటి హాని జరిగినా సీఎం జగన్, పోలీసులదే బాధ్యత అంటూ లోకేశ్ హెచ్చరించారు.
అచ్చెన్నాయుడు: బీటెక్ రవి అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. బాబాయ్ ని చంపిన వాడికి ఆసుపత్రి చుట్టూ రక్షణ కల్పిస్తునారని.. ఏ నేరం చేయని బీటెక్ రవిని మాత్రం కిడ్నాప్ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ పోలీసులను వైసీపీ పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు న్యాయస్థానాల ముందు సమాధానం చెప్పవలసి అచ్చెన్న హెచ్చరించారు.
TDP: 'వివేకా హత్య కేసులో చివరకు ధర్మమే గెలుస్తుంది.. పులివెందుల ప్రజలు అమాయకులు కాదు'
ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం అని పులివెందులకు చెందిన శాసనమండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో 324 సెక్షన్ పెట్టి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్‌లో 330 సెక్షన్ మార్చాల్సిన అవసరమేమీ ఉందని అన్నారు. పది నెలలనుంచి రవి అందుబాటులో లేనందున అరెస్ట్ చేయలేకపోయామని చెప్పడమ్ పోలీసులకు సిగ్గుచేటు అనిపించలేదా ? అన్నారు. అందుబాటులో లేని వ్యక్తి పదిరోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిశారని ప్రశ్నించారు. తమ దగ్గరికి వచ్చిన ముద్దాయిని అరెస్ట్ చేయలేనంత దద్దమ్మలా కడప పోలీసులు అంటూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
టీడీపీ మైనార్టీ నేత ఖాదర్ భాషా: బీటెక్ రవి అరెస్ట్‌పై వైఎస్ఆర్ కడప జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ భాషా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని టీడీపీ నేతలను అరెస్ట్‌లు చేయిస్తోందని ఆరోపించారు. ఒక పక్క ముఖ్యమంత్రి మళ్లీ 150 సీట్లతో గెలుస్తాం అంటూనే... మరో పక్క ఓటమి భయంతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు సహజమని.. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని ఖాదర్ భాష పేర్కొన్నారు.
బీద రవిచంద్ర: బీటెక్ రవి అక్రమ అరెస్ట్ వైసీపీ కక్ష సాధింపు చర్యని టీడీపీ నేత బీద రవిచంద్ర ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కి ఓటమి భయం వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ బలపడుతుండటం, తనపై ప్రజా వ్యతిరేకత పెరగడాన్ని ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో బీటెక్ రవి చురుగ్గా వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. అరెస్ట్ చేస్తున్నారో, కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, వచ్చిందని విమర్శలు గుప్పించారు. బీటెక్ రవి పై 10 నెలల కిందట నమోదు అయిన బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ కేసు గా మారడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు బహిరంగపర్చాలని బీద రవిచంద్ర డిమాండ్ చేశారు.
పులివెందుల నుంచే జగన్‌కు చెక్ పెడతాం: ఎమ్మెల్సీ బీటెక్ రవి