రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు రావాల్సిన నీటిని తెలంగాణ ప్రభుత్వం తోడేస్తుంటే సీఎం జగన్.. చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నారని ఆక్షేపించారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఇపుడు జలవివాదాన్ని ఎందుకు కూర్చుని చర్చించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
తరచూ కేసుల మాఫీ కోసం తరచూ హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి వద్దకు వెళ్లే జగన్.. రాష్ట్రంలో ఇంతటి క్లిష్ట సమస్య ఉన్నపుడు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. జలవిద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని వృథాగా సముద్రంలోకి పంపిస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్కు రోషం రావడం లేదా అని ప్రశ్నించారు. తక్షణం ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిలో జలవివాదం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమలో దాదాపు అన్ని స్థానాలు కైవసం చేసుకున్న మీరు... సీమ వాసులకు ద్రోహం చేస్తారా అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా లక్ష కుటుంబాలు నిర్వాసితులు అయ్యాయని.. వారిలో 80 వేల కుటుంబాలు రాయలసీమకు చెందిన వారివేనని గుర్తు చేశారు.
ఇదీ చదవండి..