TDP Fires on CM Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప పర్యటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ప్రజలను ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా చేస్తున్నారని, అఖిలపక్ష పార్టీ నాయకులకు ముందస్తు నోటీసులు ఇచ్చి పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారని తెలిపారు.
సొంత జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారంటే ప్రజలు ఎంతో ఆత్రుతగా చూస్తారని, కానీ జగన్ వచ్చి, వెళ్లేంతవరకూ కడప ప్రజలకు నరకయాతనే అని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలేదని దుయ్యబట్టారు. కాగా శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప పర్యటనకు విచ్చేశారు.
బస్సుల దారి మళ్లించి,బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టి- సీఎం జగన్ పర్యటనతో ప్రయాణికులకు నరకయాతన
ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు: జగన్ ఎప్పుడో సాయంత్రం మూడు గంటలకు కడపకు రానున్న నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహంతో ఉదయం నుంచే బస్సులను శివారు ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని టీడీపీ నేతల అన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే భయపడుతున్నారని, పరదాల నడుమ పర్యటన ముగుస్తుందని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు.
కలెక్టరేట్ నిర్మించి కనీసం పది సంవత్సరాలు కూడా కాలేదని, అంతలోపే మళ్లీ రీమోడల్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. కూడళ్లను ఆధునికరించారే తప్ప శివారు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. కూడళ్లను అభివృద్ధి చేసినంత మాత్రాన అభివృద్ధి కాదని విమర్శించారు.
సీఎం జగన్ ప్రారంభించి వెళ్లక ముందే ఇలా పెచ్చులూడిపోయాయి- నాసిరకం పనులపై ఆగ్రహావేశాలు
జగన్మోహన్ రెడ్డికి ఇదే చివరి పర్యటన: కడప జిల్లా మొత్తం కరవుతో అల్లాడుతుంటే, కనీసం ఒక్క మండలాన్ని సైతం కరవు మండలంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఎక్కడి ప్రాజెక్టు అక్కడే ఆగిపోయాయని, ఉక్కు కర్మాగార పనులు ముందుకు కదల్లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇదే చివరి పర్యటనని, ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ప్రజలు ఆయనను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడళ్లను, రోడ్లను ఆవిష్కరించడం, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కటింగ్ షాపులను, హోటళ్లను ప్రారంభించడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ విమర్శించారు. ఉపముఖ్యమంత్రి కడపను దోచుకొని దాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని ఆరోపించారు.
సీఎం జగన్ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా?
నాలుగు నెలల పాటు కష్టపడి పనిచేయాలి: రానున్న ఎన్నికలలో కడప నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని కడప టీడీపీ బాధ్యులు మాధవి రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డు నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కొత్తగా నియామకాలను చేపట్టారు. మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెలకు సంబంధించిన నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఎక్కువగా యువతను నియమించారు.
ప్రతి ఒక్కరు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అమలుపరిచిన మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాలని, వైసీపీ వైఫల్యాలను వివరించాలని ఆమె సూచించారు. నాలుగు నెలల పాటు కష్టపడి పని చేస్తే అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు.