కడప నుంచి బెంగళూరుకు నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టులో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిర్మాణ వ్యయంలో సగం వాటా భరించాల్సి ఉండటంతో.. కేవలం కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతపురం జిల్లా ముదిగుబ్బ వరకు కొత్త లైన్ నిర్మించడం ద్వారా కడప నుంచి బెంగళూరుకు రైల్వే మార్గం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లాల్సిన కడప-బెంగళూరు రైల్వేలైను.. ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు పరిమితం కానుంది. వాస్తవంగా కడప-బెంగళూరు మధ్య 255 కి.మీ. రైల్వే లైను 2008-09లో మంజూరైంది. ఇందులో 205 కి.మీ. మన రాష్ట్ర పరిధిలో ఉండగా.. మిగిలింది కర్ణాటకలోకి వస్తుంది. ఇది కడప నుంచి పెండ్లిమర్రి, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, చిత్తూరు జిల్లాలో వాయల్పాడు, మదనపల్లె, కర్ణాటకలోని మదగట్ట, ముళబాగల్ మీదుగా వెళ్లి కోలారు-బంగారుపేట రైల్వే లైన్‌లో కలుస్తుంది. అక్కడి నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ ఉంది.
తాజా ప్రతిపాదనలో..
ఇప్పటికే కడప నుంచి ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి మీదుగా గుంతకల్లు వైపు రైల్వే లైను ఉంది. ఇందులో ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ వరకు 72 కి.మీ. కొత్త లైను నిర్మించాలని ప్రతిపాదించారు. అటు పాకాల నుంచి కదిరి మీదుగా ధర్మవరం వైపు వెళ్లే మార్గంలో కలపాలని కోరారు. దీనివల్ల ముదిగుబ్బ నుంచి ధర్మవరం, పెనుకొండ, హిందూపురం మీదుగా బెంగళూరుకు కనెక్టివిటీ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రెండో దశలో ముదిగుబ్బ నుంచి ధర్మవరం-పుట్టపర్తి (ప్రశాంతి నిలయం) లైన్లో కలిసేలా 30 కి.మీ. నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే.. ధర్మవరం వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం మీదుగా బెంగళూరుకు వెళ్లేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
నిర్మాణ భారం తగ్గించుకునేందుకే..
ప్రస్తుతం ఉన్న కడప-బెంగళూరు ప్రాజెక్టు విలువ రూ.3,040 కోట్లు ఉంది. ఇది పూర్తయ్యేసరికి రూ.4వేల కోట్లకు చేరే వీలుందని భావిస్తున్నారు. ఇందులో సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇక ముద్దనూరు-ముదిగుబ్బ మధ్య 72 కి.మీ. లైనుకు రూ.1,400 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో సగం వెచ్చించగలమని ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్త ప్రతిపాదనపై కొంతకాలం కిందట సీఎం జగన్ రైల్వే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకు రైల్వేబోర్డు నుంచి నిర్ణయం వెలువడలేదు.
ఇదీ చదవండి:
CLASSES MERGING EFFECT: తరగతుల విలీనంతో.. విద్యార్థులకు బడి దూరం.. చదువు భారం