Proddatur Municipal Council meeting: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పలువురు పురపాలక కౌన్సిలర్ల అసమ్మతి భేటీ ఆసక్తిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరుల పెత్తనం నేపథ్యంలో శుక్రవారం వైసీపీ కౌన్సిలర్లు ఓ రిసార్ట్‌లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తీరుపై చర్చించినట్లు వార్తలు రావడంతో, కౌన్సిలర్లను దారికి తెచ్చుకోవడం కోసం పురపాలక సంఘం శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి, కౌన్సిలర్లను దారికి తెచ్చుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. అభివృద్దిపై పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
కమిషనర్ సెలవులో ఉన్నా అత్యవసర సమావేశం : శనివారం ప్రొద్దుటూరు పురపాలక సంఘం అత్యవసర జరిగింది. కమిషనర్ పత్తిపాటి రమణయ్య సెలవులో ఉన్నప్పటికీ, కమిషనర్ లేకుండా సమావేశం నిర్వహించాంచారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం సారథ్యంలో సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు కౌన్సిలర్లు హాజరు కాకపోవడం చర్చాంశనీయమైంది. శనివారం జరిగిన సమావేశంలో మున్సిపాల్టీలో పలుపనులకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించారు. చాలా రోజులుగా కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి పనులను ప్రతిపాదించినప్పటికీ నెలలతరబడి ఆమోదం పొందలేదు. అసమ్మతి శిబిరం నిర్వహించిన తరుణంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు అధికారులు ఆమోదముద్ర వేశారు. మరోవైపు కొంతమంది కౌన్సిలర్లు శుక్రవారం మధ్యాహ్నం విందు పేరిట ప్రత్యేక భేటీ నిర్వహించిన నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా అత్యవసర సమావేశం నిర్వహించారనే ప్రచారం జరిగింది.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరసన - సబ్ రిజిస్ట్రార్‌ను తొలగించాలని డిమాండ్
విందుతో బయటపడ్డ లుకలుకలు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, పురపాలక వైస్ చైర్మన్ బంగారురెడ్డి అనుమతిలేనిది ఏపని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, గత నాలుగేళ్ల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీ నేతల్లోని అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పావులు కదిపారనే ఆరోపణలు వినిపిస్తున్నయి. అందులో భాగంగా అసమ్మతి కౌన్సిలర్లతో రమేష్ యాదవ్ కనుసన్నల్లో భేటీ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి . ఈ భేటీలో తమకు రాజకీయంగా, అధికారాలు, నిధులు కేటాయింపు పరంగా జరిగిన అన్యాయంపై పలువురు కౌన్సిలర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సహచర కౌన్సిలర్లు, ఇతర నేతలు సైతం ఎమ్మెల్యే, ఆయన బావమరిది పెత్తనం, ఇతరుల పై అణచివేత చర్యలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు, మున్సిపల్ సమావేశం నిర్వహించి అసమ్మతి నేతలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే శనివారం మున్సిపల్ సమావేశం నిర్వహించి అభివృద్దిపై పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసేలా చర్యలు చేపట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోసారి తెరపైకి అసమ్మతి రాగం - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల సమావేశం