కడప జిల్లాలో వర్షాభావ ప్రాంతాలైన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో మామిడి సాగు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కాపు దశలో ఉన్న మామిడిని తెగుళ్ల బెడద వెంటాడుతోంది. కాయ పక్వానికి వచ్చే లోపే పురుగులు పడుతున్నాయి. దిగుబడి చేతికొచ్చే దశలో పంట దెబ్బతినడంతో రైతులు కుదేలవుతున్నారు.
గతేడాది నవంబరు పూతకొచ్చిన మామిడి చెట్లు మార్చిలో దిగుబడినిస్తాయి. తొలిదశలో మంచి ధర పలకగా ప్రస్తుతం కాయ పురుగు చూసి వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈగకు తోడు జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు మామిడి కాపు దెబ్బతింది. వడగండ్లతో మచ్చలు రావడంతో మార్కెట్లో కాయలకు డిమాండ్ తగ్గింది. బె నిషా రకం టన్ను రూ.30,000 మించి పలకడం లేదు. పైకి చక్కగా కనిపిస్తున్నా లోపల పురుగులుంటున్నాయని వ్యాపారులు అంటున్నారు.
పండు ఈగ నివారణకు లింగాకర్షక బుట్టలను వాడాలని ఉద్యాన శాఖ అధికారి మధు మల్లేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లాక్డౌన్తో రైతులు బయటకు వెళ్లి బుట్టలు తెచ్చుకోలేని పరిస్థితి లేదన్నారు. లింగాకర్షక బుట్టలలో నోవాక్రాన్ మందు బిళ్లలు ఉంచితే వాసనకు ఈగలు ఆకర్షించబడి బుట్టలోకి చేరి చనిపోతాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 60 శాతం పైబడి దిగుబడి వచ్చిందని, మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తం కావాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: రాజంపేటలో 3 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు