Pulivendula DSP press meet : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పట్టపగలు తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపి ఒకరి మృతికి కారకుడైన నిందితుడు భరత్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందుల పట్టణంలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి దిలీప్, మహబూబ్ బాషాపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా దిలీప్ మృతి చెందాడు. మహబూబ్ బాషా గాయపడి ప్రస్తుతం చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన ఘర్షణతోనే భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం నిందితుడు భరత్ యాదవ్ ను పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు ఉపయోగించిన రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గన్ లైసెన్స్ మంజూరు ఇలా... గత ఏడాది భరత్ కుమార్ యాదవ్ ఓ ప్రధాన కేసులో సాక్షిగా ఉన్నందున... తనకు ముప్పు ఉందని సీబీఐకి, జిల్లా పోలీసులకు దరఖాస్తు చేసుకున్నందున అన్నింటినీ విచారించి తుపాకీ లైసెన్సుకు సిఫారసు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతడి రివాల్వర్ డిపాజిట్ చేసుకొని ఈనెల 24న తిరిగి ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ దిలీప్ మృతదేహానికి వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు పులివెందులలోని నిందితుడు భరత్ కుమార్ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారించారు. సర్ధిచెప్పి వారిని ఇంటికి పంపించి వేశారు.
పులివెందుల కాల్పుల ఘటనలో భరత్ యాదవ్ అనే వ్యక్తి.. దిలీప్, అతడి బావమర్ధి మహబూబ్ బాషాతో వ్యక్తిగత, ఆర్థిక విషయాలు మాట్లాడుకుంటున్న క్రమంలో ఘర్షణ ఏర్పడింది. భరత్ యాదవ్ వెంటనే ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకుని వచ్చి దిలీప్, అతడి బావమర్ధిపై కాల్పులు జరిపాడు. దీంతో గాయపడిన ఆ ఇద్దరినీ కడప ఆస్పత్రికి తరలిస్తుండగా దిలీప్ మృతి చెందాడు. మహబూబ్ బాషా తీవ్ర గాయలతో చిత్తూరులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు. ఈ రోజు భరత్ యాదవ్ ను అరెస్టు చేసి కాల్పులకు ఉపయోగించిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం కోర్టులో హాజరు పరిచి.. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత లోతైన దర్యాప్తు చేస్తాం. ఓ ప్రధాన కేసుకు సంబంధించి.. భరత్ యాదవ్ తనకు ప్రాణహాని ఉన్నదంటూ 2021 జూన్ నెలలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం, సీబీఐ, జిల్లా పోలీస్ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో విట్ నెస్ ప్రొటెక్షన్ కింద లైసెన్స్ మంజూరు చేశాం. - శ్రీనివాసులు, డీఎస్పీ, పులివెందుల
ఇవీ చదవండి :