Pensioners Concerns in AP: జనవరి నుంచి 250 రూపాయలు పెంచి... మొత్తం 2750 రూపాయలు పింఛను అందిస్తామని ఇటీవలే సీఎం జగన్ ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంతో సంబరపడ్డారు. పింఛన్ల తొలగింపు నోటీసులతో ఆ ఆనందం నగదు అందుకోక ముందే ఆవిరైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత వేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమ్మనాపల్లికి చెందిన బూసి సత్యశ్రీ భర్త శ్రీనివాసప్రసాద్ చనిపోతే ఇద్దరు పిల్లలతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వితంతు పింఛను వస్తున్న సత్యశ్రీకి.. భర్త బతికున్న సమయంలో ఆదాయపన్ను కట్టారని, పింఛను తొలగించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో బిడ్డలతో సహా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కలెక్టర్‌కు లేఖ రాయడం కలకలం రేపింది.
పెద్దవాడు ఏడోవతరగతి చదువుతున్నాడు. చిన్నవాడు ఐదోవతరగతి చదువుతున్నారు. మా ఆయన ఉన్నప్పుడు నాగపుర్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. నా భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది. అంతా బాగా ఉందని అనుకునే సమయంలో పింఛన్ తొగింపుతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తన తండ్రి ఉన్నంతవరకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అందు కోసం తమ ముగ్గురిని కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నాను. సత్యశ్రీ, పింఛను తొలగించిన బాధితురాలు
వైఎస్ఆర్ కడప జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను దారులు 2 లక్షల 40 వేల మంది ఉండగా... 13 వేల మందికి తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భర్తలను పోగొట్టుకుని ఎవరి ఆసరా లేకుండా ఒంటరిగా జీవిస్తున్న తాము పింఛన్లు తొలగిస్తే ఎలా బతకాలని వృద్ధులు విలపిస్తున్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోనే ఇప్పటివరకు 4 వేల మంది పింఛను దారులకు నోటీసులు అందటంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.
కర్నూలులోని సాయిబాబా సంజీవయ్య నగరానికి చెందిన రజాక్, ముంతాజ్ దంపతులకు బాష, రసూల్, మాలన్ ముగ్గురు సంతానం. ఈ ముగ్గురు దివ్యాంగులు కావడంతో పింఛన్లు వస్తోంది. రజాక్ గతంలో బండిపై ఐస్ క్రీమ్‌లు అమ్మేవాడు. ప్రస్తుతం ఆరోగ్యం, వయస్సు సహకరించక ఇంటికే పరిమితం అయ్యాడు. రజాక్ భార్య ముంతాజ్ ఇళ్లలో పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది.1000 చదరపు అడుగులకు మించి ఇల్లు ఉందని చెప్పి అధికారులు ఫించన్లు ఇవ్వమని నోటీసులివ్వడంతో...రజాక్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. రజాక్ ఇంటి పక్కనే ఉన్న నిరుపేద రసూల్‌కు 20 ఎకరాల పొలం ఉందని పింఛను తొలగించడంతో ఎలా బతకాలంటూ వాపోతున్నారు.
దివ్యాంగ పింఛన్ ఇస్తున్న సాకుతో ఇంట్లోని కుటుంబసభ్యులకు వృద్ధాప్య పింఛన్లు తొలగించడం సరికాదని నెల్లూరులో దివ్యాంగులు నిరసనకు దిగారు. పింఛన్ తొలగిస్తూ నోటీసులివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: