Major Bridges Construction Stalled in Srikakulam: గత కొన్నేళ్లుగా వంతెనల నిర్మాణాల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణాలు నిలిచిపోవడంతో వందలాది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వంతెనల నిర్మాణాలు 50 శాతంపైగా పూర్తయినా ఐదేళ్లలో వైఎస్సార్సీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వంతెనలను పూర్తిచేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులపై 2014-19 మధ్య టీడీపీ హయాంలో హైలెవెల్ వంతెనల నిర్మాణాలు చేపట్టారు. వంశధార నదిపై నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలను కలుపుతూ ఒక వంతెన, రాజాం- ఆమదాలవలస నియోజకవర్గాలను కలుపుతూ నాగావళి నదిపై మరో బ్రిడ్జి 50 శాతం పూర్తి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేసింది. దీంతో సకాలంలో వంతెనలు పూర్తవుతాయనుకున్న ప్రజలు నిరాశ చెందుతున్నారు.
బిల్లులు చెల్లించకపోవడంతో: ఇసుకలపేట- వాల్తేరు గ్రామాల మధ్య బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం 2018లో టీడీపీ ప్రభుత్వం 60 కోట్లు నిధులు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు. పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారింది. 2019లో 80 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. 50 శాతం పనులు పూర్తయ్యాయి. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పడవ ప్రయాణాలకు అధికారులు అనుమతించకపోవడంతో నది దాటాలంటే దాదాపు 50 కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రీకాకుళం- నరసన్నపేట నియోజకవర్గాల మధ్య వంశధార నదిపై పోలాకి, గార మండలాల్లో 50కి పైగా గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వంశధార నది దాటాలంటే జాతీయ రహదారిపై చుట్టూ తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వీరి కష్టాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎండీఆర్ ప్లాన్ నిధుల నుంచి 72 కోట్లతో వనిత నుంచి గార వరకు వంశధార నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో ఐదేళ్లలో గుత్తేదారులు పనులు చేపట్టకుండా నిలిపివేశారు.
"కాంట్రాక్టర్‌కి పర్సంటేజ్ బేసిస్ మీద పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలా వాటికి అదే విధంగా బిల్లులు ఇచ్చాము. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కడపనులు అక్కడే ఆగిపోయాయి. పనులు స్టార్ట్ చేస్తే డబ్బులు ఇస్తామని కాంట్రాక్టర్‌కి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకూ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. వాళ్లు స్పందించకపోతే ఈ విషయాన్ని నేను సీఎం వద్దకు తీసుకెళ్తాను". - గొండు శంకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే
ఓవైపు పచ్చని పొలాలు, మరోవైపు కృష్ణమ్మ - మధ్యలో బాహుబలి బ్రిడ్జి - ఇవిగో డ్రోన్ విజువల్స్