CAT Circuit Bench inaugurated in Vijayawada: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) సర్క్యూట్ బెంచ్‌ను విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ భవన్‌లో ప్రారంభించారు. క్యాట్ ఛైర్మన్ జస్టిస్ రంజిత్ వంసతరావు మోరే, క్యాట్ సభ్యులు షాలినీ మిశ్రా వర్చువల్‌గా పాల్గొన్నారు. హైదరాబాద్ క్యాట్ హెచ్‌ఓడీ, జ్యుడీషియల్ మెంబర్ డాక్టర్ లతా బి పాట్నే, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు వీఎస్‌కే కౌముది, రిజిస్ట్రార్ నవీన్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌లో సర్క్యూట్ బెంచ్ లేకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు తమ సర్వీసు పరమైన అంశాల్లో న్యాయం కోసం దిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్‌ను లేదా హైదరాబాద్‌లోని క్యాట్‌ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలోనే సర్క్యూట్ బెంచ్ అందులోకి వస్తుండడంతో ఇకపై వారంతా ఆ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు.
ప్రతి నెల 3వ వారం 5 రోజులపాటు విజయవాడలోని క్యాట్ సర్క్యూట్ బెంచ్ అందుబాటులో ఉంటుందని ఈ బెంచ్ ఇన్‌ఛార్జి డాక్టర్ లతా బి. పాట్నే తెలిపారు. విజయవాడ బెంచ్ అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటైందని అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో క్యాట్ బెంచ్ ఏర్పాటు కోసం సీఆర్‌డీఏ స్థలం కేటాయించిందని అక్కడ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఆటోనగర్ స్టాలిన్ కార్పొరేట్ ఐదో అంతస్తులో ఈ బెంచ్ కార్యకలాపాలు కొనసాగుతాయని రిజిస్ట్రార్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
సింహాచలం రైల్వేస్టేషన్‌కు నిధులు - సాకారమవుతున్న ఎన్నో ఏళ్ల కల
కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్