కడప జిల్లాలో గతేడాది ఖరీఫ్ (2020)లో వరి, వేరుసెనగ, కంది, టమోటా, దానిమ్మ, తదితర పంటలను రైతులు సాగు చేశారు. 1,08,612 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉండగా 1,08,724 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఉద్యాన పంటలు 90 వేల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి.
* ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ వస్తుంది. సకాలంలో వర్షం పడక, విత్తనం మొలక సరిగా రాక, తిరిగి విత్తేందుకు సమయం అనుకూలించకపోవడం తదితర కారణాలతో రైతులు నష్టపోయారు. అందులో వ్యవసాయ, ఉద్యాన పంటలు ఉన్నాయి. వీటికి వాతావరణ ఆధారిత పంటల బీమా వస్తుంది. ఇందులో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో దెబ్బతిన్నాయనే వివరాలు లేవు.
ఈ-కర్షక్‌లో నమోదైన పంటలకే...
బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు, రుణం తీసుకోని రైతులకు ప్రభుత్వమే వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా కింద ప్రీమియం చెల్లిస్తోంది. ఈ-కర్షక్‌లో నమోదు చేసిన పంటలనే అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అలా నమోదైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో మరో సారి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ లోపు పరిశీలించి జిల్లా కార్యాలయానికి వివరాలు పంపాల్సి ఉంటుంది.
1.21 లక్షల మంది రైతులకు లబ్ధి
గతేడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ప్రకటించిన వాటికి మాత్రమే బీమా వర్తించనుంది. వరి, వేరుసెనగ, చీనీ, టమోటా, దానిమ్మ, పొద్దుతిరుగుడు, తదితర పంటలు ఇందులో ఉన్నాయి. ఎంత విస్తీర్ణానికి వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుందనే వివరాలు అధికారుల వద్ద లేవు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం 1.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు సమాచారం. వరి పంట సాగుచేసిన 85 వేల మంది, 16 వేల మంది చీనీ, 15,800 మంది వేరుసెనగ రైతులు, టమోటా పంట కింద 2,800 మంది, దానిమ్మ తోటల కింద 1600, పొద్దుతిరుగుడు సాగుచేసిన 900 మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
25న ఖాతాల్లోకి..
వాతావరణ ఆధారిత బీమా కింద 2020 ఖరీఫ్‌లో నోటిఫై అయిన పంటలకు వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా వర్తించనుంది. ఎంపిక చేసిన పంటలు, విస్తీర్ణం, మొత్తం, తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా ఉన్నతాధికారుల అనుమతితో ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అలా పంపిన వివరాల మేరకు ఈ నెల 25న ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పరిశీలన చేస్తున్నారు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో పరిశీలన జరుగుతోంది. వివరాలు రాగానే జేడీ లాగిన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారుల అనుమతితో ప్రభుత్వానికి పంపిస్తాం. అర్హులైన రైతులకు వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుందని. - వ్యవసాయశాఖ బాధ్య సంయుక్త సంచాలకులు రాధాదేవి వివరించారు.
ఇవీ చూడండి…