కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. లీగల్ అవేర్సెస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కడప రిమ్స్ వైద్యులు, సిబ్బందికి రూ.11 లక్షలు విలువ చేసే పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, ఇతర సామగ్రిని అందించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వీటిని వైద్యులకు పంపిణీ చేశారు.
దేశ సరిహద్దుల్లో కనిపించే శత్రువులను మన సైనికులు ఏవిధంగా ఎదుర్కొంటున్నారో.. మన దేశంలో కనిపించని కరోనా వైరస్ శత్రువును వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొంటున్నారని అవినాశ్ రెడ్డి అభినందించారు. కరోనా వైరస్ కారణంగా దేశానికి, రాష్ట్రానికి పటిష్టమైన మెడికల్ వ్యవస్థ, ఆధునిక పరికరాలు అవసరమనే విషయం తేటతెల్లమైందన్నారు.
కొవిడ్ పరీక్షలు చేయడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. సీఎం జగన్... కరోనాను ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా