అక్రమ ఆదాయం ఎక్కడ ఉంటుందో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం అక్కడ ఉంటుందని.. కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఇసుక దందాలో రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ సంపాదించలేనంతగా డబ్బు సంపాదించుకున్నారన్నారు. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడినా జ్ఞానోదయం కాలేదని విమర్శించారు. తెదేపాలో ఉంటే గతంలో ఉన్న క్రిమినల్ కేసులు, అవినీతితో ఇబ్బందులకు గురవుతామని భావించి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేశ్, సృజనా చౌదరిలు భాజపాలో చేరారని ఆరోపించారు.
ఇప్పుడు ఆ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా, పారదర్శకంగా ఇసుక అందించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. ఇసుక దందా, నాటుసారాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెదేపా నాయకుల అవినీతి, అక్రమాలు బట్టబయలు కానున్నాయని.. తప్పు చేసిన వారికి గుణపాఠం తప్పదన్నారు.
ఇవీ చదవండి...