కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి. అగ్రహారం ప్రాంతంలో కొండగుట్టలపై వజ్రాల అన్వేషణ కొనసాగుతోంది. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు గుంపులుగా చేరి అన్వేషణ చేస్తున్నారు. గుట్టలపై తళక్కుమనే రాళ్లను కొందరు సేకరించి దాచుకుంటున్నారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై భార్యాపిల్లలతో చేరుకుని వజ్రాల అన్వేషణలో నిమగ్నమవుతున్నారు. కొందరు తమకు దొరికింది వజ్రంగా భావించి నిర్ధారించుకునేందుకు తంటాలు పడుతున్నారు.
పది రోజులుగా ఆ ప్రాంతంలో అన్వేషణ జరుగుతున్నా తమకు వజ్రం దొరికిందనే మాట ఎవరి నుంచి వినిపించలేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా వాటిని దాచారని, అప్పట్లో ఊహించని వైపరీత్యాలతో వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న సమయంలో వజ్రాలు బయటపడుతాయన్న ఆశతో గుట్టరాళ్లను కదిలిస్తున్నారు. కొందరు ఉదయమే గుట్టల వద్దకు చేరుకుని వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారని ఆప్రాంత వాసులు తెలిపారు.
ఇదీ చదవండి:
SRI LAXMI : 'బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి'