Jagananna Colony Houses : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టకుండానే బిల్లులు అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనానికి హౌసింగ్ పీడీ స్పందించారు. హౌసింగ్ పీడీ కృష్ణయ్య ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో శుక్రవారం పరిశీలన చేశారు. తొలి దశలోనే దాదాపు 50 లక్షల రూపాయలు అక్రమాలు జరిగినట్లు పోలీసులకు జమ్మలమడుగు ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్ల అర్బన్ లేఔట్లలో 1101 ఇళ్ల నిర్మాణ బాధ్యతలను మూడు కంపెనీలకు అప్పగించారు. వీటిలో 110 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఏఈ శ్రీనివాసులు లాగిన్ ద్వారా బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 11 ఇళ్లకు కనీసం ఇంటి నిర్మాణం ప్రారంభించకుండానే నగదు చెల్లించారు. పునాదుల దశలో ఉన్న 34 ఇళ్లకు 24 లక్షల 94 వేల 200 రూపాయల బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన 18 ఇళ్లకు 22 లక్షల 3 వేల 980 రూపాయల నగదు చెల్లించినట్లు.. నిర్దేశించిన నగదు కంటే 9లక్షల రూపాయల వరకు అదనంగా చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం పరిశీలనకు వచ్చిన హౌసింగ్ పీడీ కృష్ణయ్య అక్కడ జరుగుతున్న పనులను చూసి అసహనం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ అధికారుల తీరుపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపం ఉందని.. లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లను అందించేందుకు అధికారులు పర్యవేక్షణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
లబ్దిదారులు తమ ఇంకా బిల్లులు రాలేదని వాపోతున్నట్లు ఆయన తెలిపారు. అక్రమాలపై పూర్తి విచారణ చేస్తామని హౌసింగ్ పీడీ వివరించారు. విచారణ అనంతరం ఎంత మేరకు అవినీతి జరిగిందనే ఆంశాలపై పూర్తి వివరాలు సేకరించి.. అధికారులకు నివేదిక పంపుతామని కృష్ణయ్య తెలిపారు. ఇంటి నిర్మాణాలు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించిన హౌసింగ్ ఏఈ శ్రీనివాసులుపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :