నీటిపై తేలియాడే ఫలకాలతో సౌర విద్యుత్ ప్రాజెక్టును దాదాపు వెయ్యి ఎకరాల్లో ఏర్పాటుచేసేందుకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ప్రతిపాదనలను రూపొందించింది. కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌పై సుమారు 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ తరహాలో ఏర్పాటుచేసే మొదటి భారీ ప్రాజెక్టు ఇదే అవుతుందని అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ ఎగుమతి విధానంలో ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. నీటిపై తేలియాడే సౌరఫలకాల విద్యుత్ ప్రాజెక్టుకు 20% అదనంగా వెచ్చించాలని అధికారులు తెలిపారు. విద్యుత్ ఎగుమతి విధానం కింద సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూములను నెడ్‌క్యాప్ గుర్తించింది. నాలుగు జిల్లాల్లో కలిపి సుమారు 17,800 మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో 35 వేల ఎకరాల భూములను నెడ్‌క్యాప్ గుర్తించింది. ఇదే ప్రాంతాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకూ అవకాశం ఉందని నివేదికలో తెలిపింది. తేలియాడే సౌర ఫలకాలతో తిరుపతిలోని బాలాజీ రిజర్వాయర్‌లో 4 మెగావాట్లు, విశాఖలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో 3 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తున్నారు.