గండికోట జలాశయంలో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. పరిహారం ఇస్తున్నాం.. తీసుకుని ఇళ్లు ఖాళీ చేయండని అధికారులు అంటున్నారు. పునరావాస కాలనీల్లో వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో ఇదే విషయమై ఉద్రిక్తత నెలకొంది. పరిహారం తీసుకున్నవారి ఇళ్లు కూల్చివేయడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. రెండురోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు.
పునరావాస కాలనీలో ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలంతా ఒక్కటై.. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఇళ్లు ఖాళీ చేసేదీ లేదని చెబుతున్నారు. గాలేరు- నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) పథకంలో భాగంగా కొన్నేళ్ల క్రితమే గండికోట జలాశయ నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా ముద్దనూరు మండల పరిధిలో ఒక గ్రామం, కొండాపురం మండలంలోని 21 పల్లెలు ముంపు జాబితాలో చేరాయి. గత ప్రభుత్వాల హయాంలోనే 15 గ్రామాలకు పరిహారం చెల్లించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గతేడాది అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం గండికోట నిర్వాసితులకు పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుని మంజూరు చేసింది. తాళ్లప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు, పి.అనంతపురం, రేగడిపల్లె, ఏటూరు గ్రామస్థులకు పరిహారం అందించాల్సి ఉంది.
గండికోట జలాశయంలో 12 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వచేస్తే కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు గ్రామాలు ముంపునకు గురవుతాయి. తాళ్లప్రొద్దుటూరులో ప్రభుత్వ పరిహారం పొందుతున్న 2869 కుటుంబాలకుగాను 1104 మంది ఆర్‌అండ్‌ఆర్ ఎంపిక చేసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున పరిహారంతో పాటు గృహనిర్మాణానికి స్థలం కేటాయించి, సహకరించాల్సి ఉంటుంది. వీరికి జులై నెలలో జోగాపురం గ్రామ సమీపంలో వంద ఎకరాలకుపైగా స్థలంలో పునరావాసకాలనీని ఏర్పాటు చేసి ప్లాట్లు కేటాయించారు. అక్కడ ఇప్పటివరకు రోడ్లు, విద్యుత్తు, తాగునీరు లాంటి మౌలిక వసతులను కల్పించలేదు. ఇందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలో పరిహారం తీసుకోవడానికి ముందుకువస్తే ఇళ్లు కూల్చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఊళ్లు మునుగుతున్నా.. వసతులు కల్పించరా...?
గండికోట జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. వెనుక జలాలు శుక్రవారం తాళ్లప్రొద్దుటూరు సమీపంలోని బీసీ, ఎస్సీ కాలనీలకు చేరువయ్యాయి. ఒకవైపు కాలనీలు మునిగిపోతున్నా.. పునరావాస కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్లను ఖాళీ చేయమంటే ఎక్కడ ఉండాలని నిర్వాసితులు ప్రశ్నించారు. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన గండికోట ముంపు బాధితులు శుక్రవారం రెండోరోజు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, మాజీ సర్పంచులు రామసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో రోడ్డు, తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్తు వంటి కనీస వసతులు కల్పించలేదు. ఉన్నఫళంగా ఊరొదిలి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కాలనీలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు.
ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితులతో ప్రభుత్వం చెలగాటం ఆడటం మంచిది కాదని ఎమ్మెల్సీ రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. ముంపు బాధితులకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపారు. ముంపు సమస్యలను తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా గ్రామాలను ఖాళీ చేయించడం ఏం న్యాయమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. ముంపు బాధితుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ముంపు బాధితులకు రూ.12.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు
మా కుటుంబం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటోంది. ఆర్‌అండ్‌ఆర్ కోరుకోగా.. ప్రభుత్వం కేటాయించిన కాలనీలో ఇంకా మౌలిక వసతులు కల్పించలేదు. ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు అంటున్నారు. మేం పశుపోషణతో వస్తున్న ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం గ్రామ సమీపంలోకి నీరు వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికెళ్లి జీవించాలి? పశువులను ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియక భయం భయంగా గడపాల్సి వస్తోంది. - సుబ్బలక్షుమ్మ, ఎస్సీ కాలనీ, తాళ్లప్రొద్దుటూరు
బాడుగకు ఇళ్లు దొరకట్లేదు...
మేం పరిహారం తీసుకోవడానికి అంగీకరిస్తే ఇల్లు కూల్చేస్తామంటున్నారు. తర్వాత మేం నడిరోడ్డుపై ఉండాలా? ప్రస్తుతం బాడుగ ఇంటి కోసం ప్రయత్నించినా దొరకని పరిస్థితి ఉంది. మా గ్రామంలో సుమారు 1100 మంది ఆర్‌అండ్‌ఆర్ కోరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో కనీస వసతులు లేవు. - గోవర్దన్‌రెడ్డి, తాళ్లప్రొద్దుటూరు
నిర్వాసితులు సహకరించాలి
ఈ ఏడాది గండికోట జలాశయంలో వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని నెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇళ్లు కూల్చడానికి అంగీకారం తెలిపిన కుటుంబాలకు మొదట పరిహారం జమచేస్తున్నాం. తాళ్లప్రొద్దుటూరులోనూ కొందరు పరిహారం తీసుకొని సమ్మతి తెలుపడంతోనే ఇళ్ల కూల్చివేతకు సిద్ధమయ్యాం. కొందరు కావాలనే ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో నిర్వాసితులు సహకరించాలి. నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కాలనీల్లో మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. - హరికిరణ్, కలెక్టర్
ఇదీ చదవండి: రైతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్