Demolition of anna canteen: అది కడపలోని పాత పురపాలక సంఘ కార్యాలయం ప్రాంతం. సమీపంలో ఎక్కడా మంచి హోటళ్లు లేవు. ఇక్కడ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. రోగులు, వారితో వచ్చే బంధువులకు, దూరప్రాంతం నుంచి నగరానికి వచ్చేవారికి సరైన ఆహారం దొరికేది కాదు. ఒకవేళ దొరికినా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చేది. అలాంటి ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో రూ.30 లక్షలు వెచ్చించి అధునాతనంగా అన్న క్యాంటీను ఏర్పాటుచేశారు. అయిదు రూపాయల నామమాత్రపు ధరతో అల్పాహారం, భోజనం అందించేవారు. ఈ అన్న క్యాంటీన్‌లో రోజూ దాదాపు 500 మంది పేదలు, ఇతరులు భోజనం చేసేవారు. వైకాపా అధికారం చేపట్టాక అన్నక్యాంటీన్లను నిలిపేశారు. ఆ తర్వాత కడపలోని అన్నక్యాంటీన్ భవనాన్ని అధికారులు కొవిడ్ కేంద్రంగా నిర్వహించేవారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి నగరపాలక సంస్థ దాన్ని కూల్చివేసింది.
కనీసం భవనంలోని ఉపయోగకర పరికరాలను కూడా తీసుకోకుండా కూల్చివేతకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ చర్యపై తెదేపా కడప నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు నేతృత్వంలో నేతలు ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వానికి కూల్చడమేగానీ... కట్టడం తెలియదని విమర్శించారు. నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు కోసం భవనాన్ని కూల్చామని కమిషనర్ రంగస్వామి ‘ఈనాడు’కు తెలిపారు. ప్రత్యామ్నాయంగా పలు స్థలాలు ఉన్నప్పటికీ అన్న క్యాంటీన్ భవనాన్ని కూల్చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ