'చాలా అవమానంగా ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరా' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు చేస్తున్న విచారణ 90 వ రోజుకు చేరింది. అందులో భాగంగా శనివారం సాయంత్రం రవీంద్రనాథ్ రెడ్డిని గంట సేపు విచారించారు. తొలిసారి ఆయన ఈ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు తెదేపా నేతలపై ఆరోపణలు చేసిన మెుదటి వ్యక్తి ఈయనే కావడం గమన్హారం.
విచారణ అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..' వివేకా బంధువు, రాజకీయ నాయకుడిని కావడంతో విచారణకు పిలిచారు. వివేకాతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆయన మీతో ఎలా ఉండేవారని ప్రశ్నించారు. నా వద్ద ఉన్న సమాచారాన్ని చెప్పా. కేసును త్వరగా పరిష్కరించమని కోరగా ప్రయత్నిస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు' అని వివరించారు. అంతకుముందు పులివెందులకు చెందిన వెంకరమణను సైతం అధికారులు విచారించారు. పులివెందులలోని ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు చెప్పుల దుకాణం యజమాని మున్నా ఆయన భార్య రజియాను విచారించి వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి
BUGGANA: ఇప్పటివరకు రూ.లక్షా 27 వేల కోట్లు అప్పు: ఆర్థికమంత్రి బుగ్గన