మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య (Viveka murder case) కేసులో 18వ రోజు సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారణ చేస్తున్నారు. పులివెందులకు చెందిన ఫైనాన్స్ ఉద్యోగి బాలు అనే వ్యక్తి... సీబీఐ విచారణకు ఇవాళ హాజరయ్యారు. బాలు ద్వారా అనుమానితులు భారీగా డబ్బులు రుణం కింద తీసుకుని ఉంటారనే సమాచారం మేరకు సీబీఐ ఆరా తీస్తోంది. అనుమానాలను నివృత్తి చేసుకోవటానికే అధికారులు బాలును భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు... కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో బృంద సభ్యులు చర్చించారు.
విచారణ వేగవంతం..
వివేకా హత్య కేసులో సీబీఐ (CBI) అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే వివేకా (Viveka) మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారించారు. ఇతను వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు డ్రైవర్ పని మానుకున్నాడు. వివేకా వద్ద ఎందుకు పని మానుకోవాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లిన అధికారులు రెండు నెలల పాటు అక్కడే ప్రశ్నించారు. ఇపుడు వరుసగా విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి:
viveka murder case: ఆ కుటుంబానికి వివేకా హత్యపై సమాచారం తెలిసి ఉంటుందా?!