గంటల వ్యవధిలోనే అన్నాతమ్ముడు కరోనాతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా లింగాలమండలం అంబకపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతుంటే.. కుటుంబ సభ్యులు బాధితుడిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. రాత్రి మృతి చెందాడు. సోదరుడి మరణవార్త విన్న అతని అన్న అస్వస్థతకు గురికావటంతో.. పులివెందులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు. మృతుడికి కరోనా పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరోగ్యంగా ఉన్న సోదరులు గంటల వ్యవధిలోనే మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కరోనాతో మృతి చెందినా.. సంబంధిత అధికారులు గ్రామంలోకి రాలేదనీ.. శానిటైజేషన్ చేయలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే గ్రామంలో పారిశుద్ధ్యపనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: విషాదం.. కరెంటు షాక్‌తో యువకుడు మృతి