Brother and sister died after falling into a water hole: మాండౌస్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలబాదులో ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. చిన్నారుల మృతితో సాలా బాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మరుగుదొడ్డి కోసం తీసిన నీటి గుంత పడి మృతి చెందారు. మరుగుదొడ్డి కోసం తీసిన గుంత వర్షపు నీటితో నిండింది. అన్నా చెల్లెలు అయిన హర్ష(6), శ్రావ్య(4) ఇంటి వద్ద ఆడుకుంటుండగా నీటి గుంతలో పడిపోయారు. స్థానికులు గమనించి హుటాహుటిన కడప రిమ్స్ కు తరలించారు .
ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మన్నీరుగా రోదిస్తున్నారు. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్నవారిని కలిచి వేసింది. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: