British Era Collectorate: చారిత్రక, వారసత్వ కట్టడాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గరవుతున్నాయి. బ్రిటీషువారు తమ అవసరాల కోసం, పరిపాళన కోసం అనేక భవణాలు నిర్మించుకున్నా పోతూపోతూ వాటిని మనకు విడిచిపెట్టారు. అటువంటి వారసత్వపు కట్టడాలను మనం పట్టించుకోక పోవటంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. పట్టించుకునేవారులేక శిథిలావస్థకు చేరుతున్నాయి
అధ్వాన్నంగా మారిన బ్రిటీష్ కాలం నాటి కలెక్టరేట్: మీరు చూస్తున్న ఈ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. 1800 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ పాలకులు కడప కలెక్టరేట్ ను నిర్మించారు. థామస్ మాన్రో మొదలుకొని స్వాతంత్రానికి పూర్వము 116 మంది కలెక్టర్లు, స్వాతంత్రం అనంతరం 49 మంది కలెక్టర్లు ఈ భవనం నుంచే పాలన కొనసాగించారు. ఇప్పటివరకు గోడలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. కానీ ప్రస్తుతం పాత కలెక్టరేట్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పాత కలెక్టరేట్ ఆవరణమంతా వాహనాలకు పార్కింగ్ గా ఉపయోగించుకుంటున్నారు. పైకప్పు పూర్తిగా దెబ్బతింది. దంతెలు కూలిపోయాయి. ఎవరు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయింది. పావురాలకు నివాసంగా మారింది. ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మద్యం తాగి సీసాలను అక్కడే పడేస్తున్నారు. ఇలా పలు రకాలుగా స్థానికులు నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
పురావస్తు శాఖ వారికి అప్పగించాలి: ఒక్క మాటలో చెప్పాలంటే వారసత్వ సంపదకు ఇదొక నిలయంగా ఉండేది. పైకప్పుపై చెట్లు మొలవడంతో ఏ క్షణమైన స్లాపు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ భవనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో అందంగా నిర్మించారు. ఇప్పట్లో ఇలాంటి కట్టడాలు నిర్మించడం అసాధ్యం. నగరానికి అందచందాలు సమకూర్చారు. బ్రిటిష్ కట్టడాలకు ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. నిర్లక్ష్యానికి గురవుతున్న ఇలాంటి కట్టడాలను పురావస్తు శాఖ వారికి అప్పగిస్తే వారు భద్రంగా ఉంచుతారని భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని పలువురు కోరుతున్నారు. పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ప్రభుత్వం పాత కలెక్టర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే పూర్వ వైభవం వస్తుందని పలువురు మేధావులు, విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
వారసత్వ సంపదను కాపాడుకోవాలి: గతంలో సిద్ధవటం నుంచి పాలన సాగించేవారు. కానీ తరచూ వరదలు రావడంతో పాలన కష్టసాధ్యంగా మారడంతో 1800లో కడప నుంచి పాలన కొనసాగించేవారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాత కలెక్టరేట్ ను నిర్మించారు. ఎంతో మంది కలెక్టర్లు ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా పాలన సాగించారు. అలాంటి కట్టడం నేడు అధ్వాన్న స్థితికి చేరుకోవడం బాధాకరం. ప్రభుత్వం కొత్త కొత్త కట్టడాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. ఇలాంటి వారసత్వ సంపదను కాపాడుకోవాలంటే నిధులు కేటాయిస్తే తిరిగి పాత కలెక్టరేట్ కు పూర్వవైభవం వస్తుంది. పురావస్తు శాఖ వారికి అప్పగించి కలెక్టరేట్ చరిత్రను నాటి తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భవిష్యత్ తరాలకు ఆదర్శం: ప్రభుత్వ అధికారులు స్పందించి కలెక్టరేట్ భవనానికి పుర్వవైభవం కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు. మరమ్మతులు చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి