రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల(rain) కారణంగా.. ఇప్పటి వరకు 3,31,732 ఎకరాల్లో పంట నష్టం(crop damaged) వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరుణుడి ప్రతాపం ఆగకపోవడంతో నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. 227 మండలాలు, 1,882 గ్రామాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలూ దెబ్బతిన్నాయి. ఇప్పటికే కోలుకోలేకుండా పోయిన రైతును మరో అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్ర తీరానికి చేరనుందనే సమాచారం మరింత కలవరపెడుతోంది.
రంగు మారుతున్న ధాన్యం
విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాల్లో వరి గింజ గట్టిపడే దశలో ఉండగా పంట నీట మునిగింది. వెన్నుకే మొలకలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు సడలించకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. ప్రభుత్వం ఈ దిశగా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
- కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 1.5 లక్షల ఎకరాల్లో సెనగ పైరు దెబ్బతింది. రైతులు ఎకరానికి రూ.10 వేల వరకు పెట్టుబడులు నష్టపోతున్నారు.
- గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో తీసేందుకు సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారింది. వర్షం కారణంగా దిగుబడులు తగ్గనున్నాయని అధికారులు గుర్తించారు.
- కృష్ణా జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న మినుముకు నష్టం వాటిల్లింది.
వెంటనే పంటనష్టం లెక్కింపు ప్రారంభించండి..
పంటనష్టం గుర్తింపు ప్రకియ వెంటనే ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు (Agriculture Minister Kursala Kannababu) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, పంటనష్టంపై జిల్లాల వ్యవసాయ సంయుక్త సంచాలకులు, ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించారు. ‘రైతు భరోసా కేంద్రాలను ప్రామాణికంగా తీసుకుని నష్టాన్ని అంచనా వేయాలి. కడప జిల్లాలో నష్టపోయిన సెనగ రైతులకు 80% రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలి. శాస్త్రవేత్తలు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, రైతులకు సలహాలు, సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులు పర్యటించాలి. వ్యవసాయ సలహామండళ్ల సభ్యులూ గ్రామాల్లో పర్యటించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు నాణ్యతా ప్రమాణాలు సడలించాలని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
పంటనష్టం అధికంగా ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, పశ్చిమ గోదావరి జిల్లాకు జేడీ శ్రీధర్, కడప జిల్లాకు ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబులకు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి