తమ వాహనం వెళ్లేందుకు అడ్డుగా ఉన్న మరో వాహనాన్ని తొలగించమని అడిగిన పెళ్లి బృందంపై దాడి చేసిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో చోటు చేసుకుంది. ఈ నెల 3, 4 తేదీల్లో మైలవరం మండలం తలమంచిపట్నంలో మహేష్ అనే వ్యక్తి పెళ్లి జరిగింది. శనివారం సాయంత్రం జమ్మలమడుగులోని ఓ ప్రార్థనా మందిరానికి చేరుకున్నారు. వేడుకకు వచ్చిన బంధువులను ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో దించేసి వెను తిరిగే సమయంలో పెళ్లి బృందం వాహనానికి మరో వాహనం అడ్డుగా పెట్టారు. దీంతో వారు వాహనాన్ని అడ్డు తీయమని హారన్ కొట్టి కోరగా ఆ వాహనంలో ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికి దిగారని బాధితులు వివరించారు. పరిస్థితి కాస్త సద్దుమణిగిన తరువాత పెళ్లి బృందం వారు ప్రార్థనా మందిరం వద్దకు వెళ్లగా, దాడి చేసిన వారు గుంపుగా వచ్చి పెళ్లికొడుకు, అతని అన్నపై ఇనుపరాడ్లతో దాడి చేశారని వాపోయారు. దాడిలో గాయపడిన పెళ్లికొడుకు, అతని అన్నను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష....