YS Jagan Meets Vallabhaneni Vamsi : విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములఖాత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసు పెట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేస్తున్నారని ఆక్షేపించారు.
పోలీసులు టోపీ మీద ఉన్న మూడు సింహాలకే సెల్యూట్ చేయాలని టీడీపీ నేతలకు కాదని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీరందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వంశీ అరెస్ట్ చేసే సమయంలో ఓ సీఐ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఏడాదిలో రిటైరవుతున్నానంటూ ఆయన అలా వ్యవహరించారని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆ సీఐ రిటైరైనా సరే అతని సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. పోలీసులు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని జగన్ సూచించారు.
Ys Jagan Strong Warning : అన్యాయాలు, అక్రమాలు చేసిన నేతలనూ వదలబోమని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ , ప్రజాస్వామ్యం దిగజారిందని ఆరోపించారు. వంశీని అరెస్ట్ చేసిన తీరే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. గన్నవరం తెలుగు దేశం పార్టీపై దాడి కేసులో బాధితుడుగా ఉన్న సత్యవర్థన్ కుటుంబాన్ని చంద్రబాబు బెదిరించారని చెప్పారు. వంశీపై తప్పుడు కేసు పెట్టించి అరెస్ట్ చేయించారని విమర్శించారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో వంశీ ఘటనాస్థలంలో లేకపోయినా చంద్రబాబు, లోకేశ్ అక్రమ కేసు పెట్టించారని జగన్ ఆరోపించారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేకే ఇదంతా చేశారని చెప్పారు. సత్యవర్థన్ పోలీసులు సహా జడ్జి ముందు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎక్కడా వంశీ పేరు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక వేధించిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. జైలు వద్దకు ఆ పార్టీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, మల్లాది విష్ణు, నందిగం సురేశ్, దేవినేని అవినాష్ వచ్చారు.
"తప్పుడు కేసు పెట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ వారికి సెల్యూట్ చేస్తున్నారు. పోలీసులు టోపీమీద ఉన్న మూడు సింహాలకే సెల్యూట్ చేయాలి. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేయవద్దు. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచిస్తున్నా." - వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి