NCC Provides Flats to Gam Gantam Dora Familys in Alluri District : ఇప్పటి వరకు పూరిళ్లల్లో దుర్భర జీవనం సాగిస్తున్న అల్లూరి అనుచరుడు గంటందొర వారసులకు కొత్త ఇంటి కల సాకారమైంది. ప్రభుత్వ సహకారంతో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఎస్ఆర్(CSR) నిధులతో జీప్లస్ టూగా రెండు భవన సముదాయాలు నిర్మించింది. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీధిలో నిర్మించిన ప్లాట్లను గాం గంటం దొర కుటుంబానికి అందజేశారు.
వారసులు అత్యంత దీనస్థితిలో : స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈ పోరాటంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి గంటం దొర. అయితే కొన్ని దశాబ్దాలుగా ఈయన వారసులు అత్యంత దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వీరి దుస్థితిపై కథనాలు సైతం ప్రసారం కావడంతో ప్రభుత్వ సహకారంతో ముందుకొచ్చిన దాతలు ఇళ్లు నిర్మించి వారికి అందించారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ అన్ని వసతులతో కూడిన గృహ సముదాయన్ని నిర్మించింది.
అధునాతన వసతులతో పక్కా ఇళ్లు : రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 ఫ్లాట్లను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ(NCC) సంస్థ ఛైర్మన్ దుర్గ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణంరాజు, కలెక్టర్ దినేష్ కుమార్ గంటం దొర వారసులకు అందజేశారు. ఎన్‌సీసీ ఫౌండర్, ఛైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన హామీ మేరకు గృహాలను నిర్మించి ఉచితంగా ఇచ్చారు. గంటందొర వారసులైన బుచ్చిదొర, లక్ష్మణదొర, బోడిదొర, తెల్లనదొర, సోమన్నదొరలకు చెందిన 11 మంది సంతానానికి అధునాతన వసతులతో గృహాలు నిర్మించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"చాల ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు ఎక్కడో పాకలో నివాసం ఉండే వాళ్లం. ఇటువంటి ఇంట్లో ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంది మా పరిస్థితి చూసి వెళ్లేవారే కానీ సాయం చేసింది లేదు. ఎన్‌సీసీ సంస్థ ముందుకువచ్చి మా కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది. వారందరికీ కృతజ్ఞతలు."
- గంటం దొర వారసులు
పోరాటాలు మరువలేనివి : సమరయోధులు గంటం దొర త్యాగాలను గుర్తించి వారి వారసులకు ఇల్లు నిర్మాణం చేసినట్టు ఎన్‌సీసీ సంస్థ చెప్తోంది. గంటం దొర వారసులకు ఇల్లు ఇవ్వడంతోపాటు స్కిల్ డెవలప్మెంట్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సంస్థ ఛైర్మన్ దుర్గాప్రసాద్ చెప్పారు. అల్లూరి సీతారామరాజుతో కలసి గంటం దొర చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు.
అల్లూరి వెంట నడిచిన స్వాతంత్య్ర పోరాట యోధుడు గంటం దొర వారసులకు దేశం తరఫున చేసే ప్రతి నమస్కారంగా ఈ పక్కా గృహాల నిర్మాణం ఆలోచన చేసినట్టు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు.
గిరిజనుల కష్టాల్లో తోడుంటాం - డోలీ మోతలు పోవాల్సిందే: పవన్ కల్యాణ్
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!