తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు విడుదల చేశారు. నిన్నటినుంచి పోలీసుల అదుపులో ఉన్న చింతమనేనికి నోటీసు ఇచ్చి విడుదల చేశారు. అనంతరం ఆయన స్వగ్రామం దుగ్గిరాలకు చేరుకున్నారు. చింతమనేని మాట్లాడుతూ.. తనపై కక్షపూరితంగా కావాలనే పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.
నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నాపై అక్రమ కేసులు బనాయించారు. విశాఖ జిల్లాలో ఉన్న తనను పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉంది -చింతమనేని ప్రభాకర్, తెదేపా నేత
ఫోన్‌లో చంద్రబాబు పరామర్శ
చింతమనేని ప్రభాకర్‌ను పార్టీ అధినేత చంద్రబాబు.. ఫోన్‌లో పరామర్శించారు. అక్రమ కేసులతో తమ పార్టీ నేతల గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతమనేనికి అండగా ఉంటామని చెప్పారు.
విశాఖలో అరెస్ట్.. ఎందుకంటే..
చింతమనేని ప్రభాకర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారంటూ.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.
తెదేపా నేతల ఆగ్రహం
చింతమనేని అరెస్టుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?' అని ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరన్న అచ్చెన్న.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు ఉదంతం ఉదాహరణగా చెప్పవచ్చని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి