covid effect on sports: కరోనాకు ముందు... పశ్చిమగోదావరి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడామైదానాలు విద్యార్థులతో కిక్కిరిసి ఉండేవి. పాఠశాలల్లో సౌత్ జోన్ క్రీడలు, కళాశాలల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేవారు. విశ్వవిద్యాలయాల్లోనూ జాతీయ స్థాయి పోటీలు జరిగేవి. క్రీడాకారులు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడాపోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడలకు దూరమయ్యారు. కరోనా, లాక్‌డౌన్ ఆంక్షలతో విద్యార్థులు ఇళ్లలోనే ఉండిపోయారు. జిల్లాలోని క్రీడా మైదానాలు కూడా మూతపడ్డాయి.
విద్యాసంస్థల్లో క్రీడల నిర్వహణ, కోచింగ్, సాధన లేకపోవడం వల్ల.... క్రీడాకారులకు ఆసక్తి సన్నగిల్లుతోంది. ఆసక్తి ఉన్నవారు నిరంతర సాధన లేక క్రీడాసామర్థ్యాన్ని కోల్పోతున్నారు. జిల్లాలో ఏడాదికి మూడుసార్లు క్రీడా పోటీలు నిర్వహించేవారు. కొవిడ్ తొలిదశలో మూతపడిన అకాడమీలు, నేటికీ తెరుచుకోలేదు. కొవిడ్ నిబంధనల వల్ల పలు కళాశాలల్లో వ్యాయామశాలలు తెరవలేదు. మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను క్రీడలకు దూరం పెడుతున్నారు. సరైన ప్రోత్సాహం లేక క్రీడాకారులు వెనుకబడుతున్నారని క్రీడాధికారులు చెబుతున్నారు.
సీఎం కప్ పేరుతో నవంబర్‌లో పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. చాలా కాలంగా క్రీడలకు దూరమైన విద్యార్థులకు... కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోటీలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో క్రీడా పోటీలు ఏర్పాటు చేయటం వల్ల ప్రాక్టీస్ దెబ్బతినకుండా ఉంటుందని శిక్షకులు చెబుతున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: Omicron Delhi: భారత్లో ఐదో ఒమిక్రాన్ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ