పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే కోడిపందేలుగా భావిస్తారు. మూడు రోజులపాటు.. పల్లె నుంచి పట్టణం వరకు బరులు ఏర్పాటు చేసి.. పందేలను నిర్వహించం ఇక్కడ ఆనవాయితీ. ఈ సారి కూడా పండుగకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు నిర్వహించడానికి బరులు ఏర్పాటయ్యాయి. అధికార యంత్రాంగం వీటి నియంత్రణకు.. వారం రోజులుగా ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇలా.. ఏటా అధికారులు పందేలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం ఉండటం లేదు.
కోడిపందేలను అడ్డుకునేందుకు సంక్రాంతికి వారం రోజులు ముందు నుంచే.. రెవిన్యూ, పోలీసు అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు. 15 రోజుల నుంచి జిల్లాలోని వివిధ ప్రాతాల్లో 120 వరకు బైండోవర్ కేసులు నమోదు చేశారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఎస్సై, ఇతర అధికారులతో కమిటీలు వేశారు. గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించరాదంటూ.. కమిటీలు ప్రచారం చేశాయి.
సంప్రదాయంగా వస్తున్న క్రీడ అంటూ.. పోలీసులకు ప్రజల నుంచి ప్రతిఘటన సైతం ఎదురవుతోంది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని సీసలి, ఐ.భీమవరం, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, ఏలూరు, జంగారెడ్డి గూడెం ప్రాంతాల్లో ఏటా భారీగా కోడిపందేలు సాగుతాయి. ఈసారి సైతం అధికార యంత్రాంగం కోడిపందేలు అడ్డుకొనేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చెబుతున్నా... పందెం రాయుళ్లు మాత్రం సై అంటున్నారు.
ఇదీ చదవండి: