పాలిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ఒక ఎయిడెడ్, 17 ప్రైవేటు, సెకండ్ షిఫ్ట్ కళాశాలలున్నాయి. వీటిల్లో గతంలో 7,334 వరకు సీట్లు ఉండగా.. ప్రస్తుతం తగ్గే అవకాశం ఉంది. జిల్లాలోని మూడు కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. ఐచ్ఛికాల ఎంపిక సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్నో ఆశలతో..
కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే పలు విద్యా సంస్థలు విద్యార్థుల వేటను ప్రారంభించాయి. సాంకేతిక విద్య చదివితే ఉపాధి అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపుతున్నారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల భర్తీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. పాలిసెట్‌కు జిల్లా నుంచి 5,700 మంది దరఖాస్తు చేయగా.. 84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కళాశాలల్లో ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సహాయ కేంద్రాలు
భీమవరంలోని బి.సీత, తణుకులోని ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుండగా.. 14వ తేదీన 1వ ర్యాంకు నుంచి 9 వేల వరకు, 15న 9001 నుంచి 24 వేలు, 16న 24001 నుంచి 42 వేలు, 17న 42001 నుంచి ఆఖరి ర్యాంకు సాధించిన విద్యార్థుల అర్హత పత్రాలను పరిశీలించనున్నారు.
తీసుకు వెళ్లాల్సిన నకళ్లు
10వ తరగతి, పాలిసెట్ హాల్‌టికెట్లు, ర్యాంకు కార్డులు
ఆదాయ ధ్రువీకరణ లేదా రేషన్ కార్డు ● ఆధార్ కార్డు
4 నుంచి 10 వరకు విద్యార్హతను తెలిపే పత్రాలు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కౌన్సెలింగ్ రుసుముగా రూ.400, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి