కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇక నేరుగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం మాత్రమే ఖర్చు చేసేందుకు వీలుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతితోనే పెండింగు బిల్లులకు నిధులు అందుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఫిబ్రవరి నెలాఖరున రూ.1800 కోట్లు విడుదల చేయగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ తన నిర్వహణ ఖర్చులు మినహాయించుకుని మిగిలిన నిధులు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఆ నిధులు వచ్చినా ఆర్థికశాఖ ఇతరత్రా అవసరాల నిమిత్తం ఆ నిధులు మళ్లించింది. పోలవరంలో ఇప్పటికీ దాదాపు రూ.320 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చేలా ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి పోలవరం అథారిటీ నుంచి ఆ నిధులు నేరుగా ఆ ఖాతాకు జమ అయ్యేలా చూస్తారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితోనే ఆ నిధులు వెచ్చించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పోలవరం అథారిటీలో ప్రత్యేకంగా ఆమోదం తీసుకుని పంపాల్సి ఉంటుందని కేంద్రం తెలియజేసింది. ఇందుకోసం పోలవరం అథారిటీ అధికారులను సంప్రదించగా ఏప్రిల్ 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: రోజుకు 17 వేల మందికి కరోనా పరీక్షలే లక్ష్యం