పోలవరం హైడ్రో ఎలక్టిక్ ప్రాజెక్టు (పీఈపీ) పనుల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ డైరెక్టర్ ఏ.రమేశ్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆగస్టు 14న ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. 80 మెగావాట్ల సామర్థ్యం గల 12 హైడ్రో పవర్ స్టేషన్ల ఏర్పాటుకోసం ఏపీ జెన్కోతో...2017 డిసెంబర్ 20న ఒప్పందం చేసుకున్నామని నవయుగ కోర్టుకు తెలిపింది. కాగా.. జడ్డి కేసును.. మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.
ఒప్పందం ఇలా
ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ. 5,220.28 కోట్లు కాగా ఒప్పందం ప్రకారం అప్పగింత తేదీ నుంచి మొదటి మూడు యూనిట్లను 40 నెలల్లో పూర్తి చేయాలి. మిగిలిన తొమ్మిది యూనిట్లను రెండు నెలలకు ఒకటి చొప్పున మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఈ దిశగా... ఒప్పంద తేదీ నుంచి తమ వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా పనులు పూర్తి చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వ్యాజ్యంలో పేర్కొన్నారు. టర్బైన్ నమూనా పరీక్షను జయవంతగా పూర్తి చేశామన్నారు.
ఏకపక్షంగా రద్దు!
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జులై 1న పునఃసమీక్ష నిర్వహించి.. కాంట్రాక్టును రద్దు చేయాలని ఏపక్షంగా నిర్ణయించారని కోర్టుకు తెలిపింది. ఒప్పంద రద్దుకు కారణాలు పేర్కొనలేదని న్యాయస్థానానికి వెల్లడించింది. ఒప్పందాన్ని రద్దు చేస్తే తమ సంస్థకు భారీగా నష్టం వస్తోందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలో తీసుకొని ఒప్పందం రద్దును... రద్దు చేయాల్సిందిగా కోరారు. కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు తమను అనుమతించాల్సిందిగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇదీ చదవండి: