IDEM KARMA PROGRAM : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో "ఇదేం కర్మ.. మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గ్రామంలో రైతులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు.
ఏలేటిపాడు గ్రామంలోని రైతులు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అదే విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేటిపాడు గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ట్రాక్టర్లు, కృషి ట్రాక్టర్లు, టార్పాలిన్లు, ఇతర వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను పెద్ద ఎత్తున అందించారని ఆరిమిల్లి గుర్తు చేశారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సంవత్సరంలో కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి ఎటువంటి పరికరాలను అందించలేదని విమర్శించారు. సరైన పరికరాలు అందక రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విధానం ద్వారా కూడా ధాన్యం అమ్మటానికి చాలా ఇబ్బందులు పడ్డట్లు రైతులు చెబుతున్నారని ఆయన అన్నారు.
ధాన్యం సేకరించి రెండు మూడు నెలలు గడుస్తున్నా రైతులకు ఇంతవరకూ ధాన్యం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే.. రైతుల పట్ల ఎంత విముఖతగా ఉందో తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడానికి, నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడి వారందరూ కూడా సంసిద్ధులై ఉన్నారని రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
దుర్మార్గ పాలనపై ఎమ్మెల్యీ ఎన్నిక గెలుపు ప్రజావిజయం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు జగన్ దుర్మార్గ పాలనపై విజయమని పలువురు టీడీపీ నాయకులు అభివర్ణించారు. పాలకోడేరు మండలం కోరుకల్లు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, వైసీపీ ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: