ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగడంతో దిగువన ఉన్న ప్రాంత ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో భద్రాచలం వద్ద గరిష్ట వరదనీటి మట్టం నమోదవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఫలితంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 90 కిలోమీటర్ల పైగా ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తీరాన ఉన్న లంక భూములు పంటలు నీట మునిగి ఉన్నాయి. పెరవలి మండల పరిధిలోని ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాకరపర్రు తదితర గ్రామాల పరిధిలో లంక భూముల్లోని తోటలుతో పాటు గోదావరి ఏటి గట్టు వెంబడి పంటలు నీటమునిగాయి.అరటి, పసుపు, పచ్చిమిర్చి, కూరగాయలతో పాటు పశుగ్రాసం తోటలు కూడా నీటిలో నానుతున్నాయి. ఇలాగే వరదలు కొనసాగితే పంట నష్టపోక తప్పదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి