పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. 20 మండలాల్లో వంద మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలోని కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల పరిధి ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావటంతో ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. వరి, వేరుశనగ పంటలు వరదతో నీటమునిగాయి. ఆగకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో రైతులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మన్యం గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కామర్కోట మండలం ఆడమిల్లి గ్రామం వద్ద రహదారి ధ్వంసం కావడంతో ఏలూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బయటకు రావడానికి వీలేక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీకి వెళ్లే పట్టినపాలెం, మైసన్నగూడెం మార్గంలో జల్లేరు వాగు, జైహింద్ కాల్వ, శుద్ధ వాగు రేగులకుంట కాల్వ, అశ్వారావుపేట వాగు, రహదారులను ముంచెత్తుతూ పొంగి ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్తగా పలు వాగుల వద్ద పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. తమ్మిలేరు, ఎర్ర కాలువ జలాశయాలకు భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 600 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తుండగా మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తమ్మిలేరు పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీ నరసాపురం మండలంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల తాటాకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వరద తాకిడికి మరుగుదొడ్లు కూలిపోయాయి. నివాసాల్లోకి మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుక్కునూరు మండలంలో వాగులో 108 అంబులెన్స్ చిక్కుకుంది. వాహనాన్ని స్థానికులు ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు.
ఇదీ చదవండీ.. GANNAVARAM AIRPORT: వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం