ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ కాఫర్ డ్యాం వెనుక భాగంలో ఉన్న పోశమ్మగండి నుంచి కొండమొదలు వైపు గోదావరి నది నిండుకుండలా కళకళలాడుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న వరద ప్రవాహం కాస్త గోదావరి ఒడ్డునున్న ఇళ్లను తాకేలా ఉండటంతో ఎప్పుడు వరద పెరిగి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు పోటెత్తిన గోదావరి దండంగి- చినరమణయ్యపేట గ్రామాల మధ్య ఉన్న దండంగి వాగుకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంటూరు నుంచి దేవీపట్నం పరిసర ప్రాంతాల నిర్వాసితులు ఆదివారం ఇళ్లలో ఉన్న సామగ్రిని ముందుగానే బయటకు తరలించారు. ఎ.వీరవరం వద్ద కడమ్మవాగు ద్వారా గోదావరి ప్రవాహం పొలాల్లోకి చేరుతోంది.
తుంగభద్రకు జలకళ
మహారాష్ట్రతోపాటు కొన్ని రోజులుగా స్థానికంగానూ వానలు కురవడంతో తుంగభద్రకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం 42,748 క్యూసెక్కుల నీరు చేరింది. మూడు రోజుల్లో సుమారు 6 టీఎంసీలు వచ్చాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 100.885 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 16.110 టీఎంసీల నీటి నిల్వలున్నాయి.
ఇదీ చదవండి..
Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు